Loading...
US-Ukraine: ఉక్రెయిన్‌కు అమెరికా భారీ సాయం.. ఎఫ్‌-16 విడిభాగాల విక్రయానికి ఆమోదం
ఉక్రెయిన్‌కు అమెరికా భారీ సాయం.. ఎఫ్‌-16 విడిభాగాల విక్రయానికి ఆమోదం

US-Ukraine: ఉక్రెయిన్‌కు అమెరికా భారీ సాయం.. ఎఫ్‌-16 విడిభాగాల విక్రయానికి ఆమోదం

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 26, 2026
12:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్ వద్ద ఉన్న ఎఫ్‌-16 యుద్ధవిమానాల నిర్వహణకు అవసరమైన పరికరాలు, ఇతర సామగ్రి విక్రయానికి ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందం విలువ 622 మిలియన్ డాలర్లు (సుమారు రూ.5,400 కోట్లు). ఈ మొత్తాన్ని యూరప్‌కు చెందిన భాగస్వామ్య దేశాలు భరించనున్నాయి. బెల్జియం,డెన్మార్క్,నెదర్లాండ్స్,నార్వే దేశాలు ఈ నిధులను సమకూర్చనున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ బుధవారం ప్రకటించింది. ఈ లావాదేవీకి సంబంధించి అమెరికా ప్రభుత్వం ఎలాంటి నిధులను ఖర్చు చేయడం లేదని స్పష్టం చేసింది. ఈ ఒప్పందంలో భాగంగా కార్ట్రిడ్జ్ యాక్చువేటెడ్ డివైజెస్, ప్రొపెల్లెంట్ యాక్చువేటెడ్ డివైజెస్, ప్రయోగశాల పరికరాలు, రవాణా సహాయ సామగ్రిని ఉక్రెయిన్‌కు అందించనున్నారు.

వివరాలు 

ఎఫ్‌-16 విమానాల నిర్వహణపై ఆందోళనలు.. సమస్యలకు పరిష్కారంగా కొత్త ఒప్పందం

గతంలో జరిగిన చిన్న స్థాయి విక్రయానికి ఈ పరికరాలను అదనంగా జత చేయనున్నారు.

ఆ పాత ఒప్పందం విలువ అమెరికా కాంగ్రెస్‌కు తప్పనిసరిగా తెలియజేయాల్సిన పరిమితి కంటే తక్కువగా ఉంది.

ఈ పరికరాల విక్రయంతో ఉక్రెయిన్ రక్షణ సామర్థ్యం మరింత మెరుగుపడుతుందని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది.

ప్రస్తుత, భవిష్యత్తు ముప్పులను ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్‌కు ఇది ఉపయోగపడుతుందని పేర్కొంది.

ఆత్మరక్షణతో పాటు ప్రాంతీయ భద్రతకు సంబంధించిన కార్యకలాపాలను మరింత సమర్థంగా నిర్వహించేందుకు ఈ ఒప్పందం దోహదం చేస్తుందని వెల్లడించింది.

కాగా, ఉక్రెయిన్ వద్ద ఉన్న ఎఫ్‌-16 యుద్ధవిమానాల నిర్వహణపై గతంలో పలు కథనాలు వెలువడ్డాయి.

వివరాలు 

ఎఫ్‌-16 విమానాలకు విడిభాగాల కొరత

నిర్వహణ పనుల్లో జాప్యం, విడిభాగాల కొరత కారణంగా ఆ దేశం వద్ద ఉన్న సగానికి పైగా యుద్ధవిమానాలు ఇప్పటికే నేలకే పరిమితమైనట్లు అక్టోబర్ ప్రారంభంలో వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రచురించింది.

ఏడాది చివరి నాటికి అమెరికా తయారీ విమానాలన్నీ ఈ సమస్యను ఎదుర్కొనే అవకాశం ఉందని పేర్కొంది.

అయితే, విమానాల లభ్యత విషయంలో తీవ్ర సమస్యలేమీ లేవని ఉక్రెయిన్ అధికారులు ఆ కథనాన్ని ఖండించారు.

కానీ ఎఫ్‌-16 విమానాలకు అవసరమైన కొన్ని విడిభాగాల తయారీ నిలిచిపోయిందని, వాటిని సేకరించడం కష్టంగా మారిందని అంగీకరించారు.

ADVERTISEMENT

వివరాలు 

నిర్వహణకు అమెరికా సాయం

2022 ఫిబ్రవరిలో రష్యా పూర్తిస్థాయి దాడిని ప్రారంభించిన తర్వాత ఉక్రెయిన్ పశ్చిమ దేశాల నుంచి ఆధునిక యుద్ధవిమానాలను అందించాలని కోరుతూ వచ్చింది.

ఈ నేపథ్యంలో రెండేళ్ల తర్వాత, అంటే 2024లో ఉక్రెయిన్‌కు తొలిసారిగా ఎఫ్‌-16 యుద్ధవిమానాలు అందాయి.

ఇప్పుడు వాటి నిర్వహణకు అవసరమైన పరికరాల కొనుగోలుకు అమెరికా ఆమోదం తెలపడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ADVERTISEMENT