LOADING...
Oman: ఒమన్ తీరంలో వాణిజ్య నౌకపై అమెరికా దాడి.. ముగ్గురు భారతీయులు గల్లంతు, భారత్ తీవ్ర ఆగ్రహం
భారత్ తీవ్ర ఆగ్రహం

Oman: ఒమన్ తీరంలో వాణిజ్య నౌకపై అమెరికా దాడి.. ముగ్గురు భారతీయులు గల్లంతు, భారత్ తీవ్ర ఆగ్రహం

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 11, 2026
08:14 am

ఈ వార్తాకథనం ఏంటి

ఒమన్‌ తీర ప్రాంతంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న 'సెటెబెలో' అనే వాణిజ్య ట్యాంకర్‌పై అమెరికా సైన్యం జరిపిన దాడి తీవ్ర కలకలం రేపింది. బుధవారం జరిగిన ఈ ఘటనలో నౌకలో ఉన్న 24 మంది భారతీయ సిబ్బందిలో 21 మంది సురక్షితంగా బయటపడగా,మరో ముగ్గురు ఆచూకీ ఇంకా తెలియరాలేదు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ దాడిపై అమెరికా సైన్యం స్పందిస్తూ.. ఇరాన్‌పై విధించిన ఆంక్షలను ఉల్లంఘించి అక్కడి నుంచి చమురును రవాణా చేసేందుకు ట్యాంకర్ ప్రయత్నించిందని,అందుకే కాల్పులు జరిపినట్లు వెల్లడించింది. అమెరికా చర్యపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పశ్చిమాసియా ప్రాంతంలో వాణిజ్య నౌకలు,పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం ఆందోళనకరమని పేర్కొంది.

వివరాలు 

పశ్చిమాసియాలో సముద్ర మార్గాల భద్రతపై అంతర్జాతీయంగా ఆందోళనలు

అంతర్జాతీయ జలమార్గాల్లో వాణిజ్య రవాణా స్వేచ్ఛగా, సురక్షితంగా కొనసాగేందుకు అన్ని దేశాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేసింది. ఈ ఘటనపై నిరసన వ్యక్తం చేస్తూ, దిల్లీలోని అమెరికా దౌత్యాధికారి జేసన్ మీక్స్‌ను భారత ప్రభుత్వం పిలిపించి తీవ్ర నిరసన తెలిపింది. భారతీయుల భద్రతకు సంబంధించిన అంశాల్లో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని స్పష్టం చేసినట్లు సమాచారం. కాగా, ఒమన్‌ తీరంలో భారతీయులు ప్రయాణిస్తున్న మరో వాణిజ్య నౌకపై కూడా అమెరికా నౌకాదళం మూడు రోజుల క్రితం దాడి చేసిన విషయం తెలిసిందే. వరుస ఘటనలు చోటుచేసుకోవడంతో పశ్చిమాసియాలో సముద్ర మార్గాల భద్రతపై అంతర్జాతీయంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement