USA: యెమెన్‌లో హౌతీలపై అమెరికా B-2 బాంబర్ల దాడి ..!
యెమెన్‌లో హూతీ తిరుగుబాటుదారులపై అమెరికా తీవ్ర స్థాయిలో దాడి చేసింది. బీ-2 స్టెల్త్ బాంబర్లను ఉపయోగించి గురువారం తెల్లవారుజామున యెమెన్‌పై దాడులు చేపట్టింది. ఈ విషయాన్ని రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ స్వయంగా ప్రకటించారు. మొత్తం ఐదు అండర్‌గ్రౌండ్ ఆయుధ డిపోలను బీ-2 స్టెల్త్ బాంబర్లు ధ్వంసం చేసినట్లు ఆయన తెలిపారు. హూతీలు ఎర్ర సముద్రంలో పౌర నౌకలను లక్ష్యంగా చేసుకోవడానికి ఉపయోగించే ఆయుధాలను భద్రపర్చే డిపోల గురించి మూడు అమెరికా అధికారులు CNNకు సమాచారం అందించారు.
శత్రువులు తమ ఆయుధాలను ఎంత లోతుగా దాచినా వదిలిబెట్టం: లాయిడ్ ఆస్టిన్
"మా నుంచి తప్పించేందుకు వీలుగా శత్రువులు తమ ఆయుధాలను ఎంత లోతుగా దాచినా, వదిలిపెట్టమన్న విషయం ఈ దాడితో నిరూపితమైంది. ఇక మా వాయుసేన బీ-2 స్టెల్త్ బాంబర్ వినియోగంతో అవసరమైనప్పుడు ప్రపంచవ్యాప్తంగా దాడి చేయడంలో మాకున్న సామర్థ్యం ఏమిటో చెప్పినట్లైంది. హూతీల సామర్థ్యాన్ని కుప్పకూల్చాలని అధ్యక్షుడు జో బైడెన్ జారీ చేసిన ప్రత్యేక ఆదేశాల మేరకే ఈ దాడిని చేపట్టాం. వారు భవిష్యత్తులో చేసే దాడులకు తీవ్ర పరిణామాలు ఉంటాయని మేము హెచ్చరిస్తున్నాం" అని లాయిడ్ ఆస్టిన్ వ్యాఖ్యానించారు.
హౌతీల పై అమెరికా తొలిసారి బీ-2
హౌతీల పై అమెరికా తొలిసారి బీ-2ను ఉపయోగించినట్లైంది.సాధారణ ఫైటర్ జెట్లతో పోలిస్తే, ఈ యుద్ధ విమానం అత్యంత శక్తిమంతంగా ఉంది. ఇది సుదూర లక్ష్యాలను కూడా అవలీలగా ఛేదించగలదు. అంతేకాదు, ఇది అత్యంత భారీ బాంబులను మోసుకెళ్లగల సామర్థ్యం కలిగి ఉంది. ఇప్పటివరకు అమెరికా కేవలం సాధారణ ఫైటర్ విమానాలనే హూతీలపై ఉపయోగించింది. ఇప్పుడు, పశ్చిమాసిలో ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు పెరిగిన సమయంలో, అమెరికా సైనిక దళాలు అక్కడ కాలు మోపనున్నాయి. థాడ్ గగనతల రక్షణ వ్యవస్థను కూడా అక్కడ మోహరిస్తోంది. ఈ నేపథ్యంలో, యెమెన్‌లో హూతీలను దెబ్బతీసేందుకు ఈ దాడి జరిగింది. గాజాలో యుద్ధం మొదలైన నాటినుంచి, హౌతీ రెబెల్స్ ఎర్ర సముద్రంలోని నౌకలపై దాదాపు 100 వరకు డ్రోన్,క్షిపణి దాడులను నిర్వహించారు.