LOADING...
US citizenship: అమెరికా పౌరసత్వం ఇక మరింత ఖరీదు.. 75శాతం వరకు ఫీజుల పెంపునకు ప్రతిపాదన
అమెరికా పౌరసత్వం ఇక మరింత ఖరీదు.. 75శాతం వరకు ఫీజుల పెంపునకు ప్రతిపాదన

US citizenship: అమెరికా పౌరసత్వం ఇక మరింత ఖరీదు.. 75శాతం వరకు ఫీజుల పెంపునకు ప్రతిపాదన

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 23, 2026
01:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇమిగ్రేషన్ నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ వస్తున్నారు. తాజాగా ఆయన ప్రభుత్వ ప్రతిపాదనలతో అమెరికా పౌరసత్వం పొందడం మరింత ఖరీదైన ప్రక్రియగా మారే అవకాశం కనిపిస్తోంది. పౌరసత్వ దరఖాస్తుల ఫైలింగ్ ఫీజులను 75 శాతం వరకు పెంచాలని యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ (DHS) ప్రతిపాదించింది. దీంతో చట్టబద్ధంగా అమెరికాకు వచ్చిన వలసదారులు పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో ప్రాసెసింగ్, వెట్టింగ్ ఖర్చులను అధికంగా భరించాల్సి రావడంతో పాటు ప్రస్తుతం అందుతున్న కొన్ని రాయితీలను కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడనుంది.

వివరాలు

760 డాలర్ల నుంచి 1,330 డాలర్లకు పెరిగే అవకాశం

ప్రతిపాదిత మార్పుల ప్రకారం, పేపర్ ఆధారిత పౌరసత్వ దరఖాస్తు ఫీజు ప్రస్తుతం ఉన్న 760 డాలర్ల నుంచి 1,330 డాలర్లకు పెరగనుంది. అదే ఆన్‌లైన్ దరఖాస్తుల ఫీజు 710 డాలర్ల నుంచి 1,280 డాలర్లకు చేరనుంది. ఈ పెంపు అమల్లోకి వస్తే దరఖాస్తుదారులపై దాదాపు 75 శాతం అదనపు భారం పడుతుంది. అంతేకాకుండా, పౌరసత్వ దరఖాస్తు తిరస్కరణకు గురైనప్పుడు పునఃసమీక్ష కోరేందుకు చెల్లించే రుసుమును కూడా భారీగా పెంచాలని ప్రతిపాదించారు. ప్రస్తుతం 830 డాలర్లుగా ఉన్న ఈ ఫీజును 1,475 డాలర్లకు పెంచాలని సూచించారు. అంటే అదనంగా 645 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రతిపాదిత నిబంధనలపై ప్రజల అభిప్రాయాలను సేకరించేందుకు 60 రోజులపాటు పబ్లిక్ కామెంట్ ప్రక్రియ నిర్వహించనున్నారు.

వివరాలు

ఫీజు రాయితీలు కూడా రద్దు

మరోవైపు, ఆదాయ ఆధారిత మార్గదర్శకాల కింద ప్రస్తుతం లభిస్తున్న ఫీజు రాయితీలను కూడా రద్దు చేయాలని డీహెచ్‌ఎస్ ప్రతిపాదించింది. ముఖ్యంగా ఫెడరల్ పావర్టీ గైడ్‌లైన్స్ ప్రకారం 400 శాతం లేదా అంతకంటే తక్కువ ఆదాయం కలిగిన దరఖాస్తుదారులకు అందిస్తున్న తగ్గింపు ఫీజు (Reduced Fee) సదుపాయాన్ని పూర్తిగా తొలగించాలని సూచించింది. ఈ మార్పులు అమల్లోకి వస్తే, అమెరికాలో శాశ్వత నివాస హోదా (గ్రీన్ కార్డ్) కలిగి పౌరసత్వానికి అర్హులైన అనేక మంది వ్యక్తులు అధిక ఖర్చుల కారణంగా దరఖాస్తు చేయడంలో వెనుకడుగు వేసే ప్రమాదం ఉందని వలసదారుల హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీంతో సహజీకరణ (Naturalization) ద్వారా అమెరికా పౌరసత్వం పొందే అవకాశాలు కొందరికి మరింత దూరమయ్యే పరిస్థితి ఉంది.

Advertisement