USCIRF: భారత్‌పై అమెరికా కమిషన్ వ్యాఖ్యలు.. వినయ్ క్వాత్రా ఘాటు కౌంటర్!
ఈ వార్తాకథనం ఏంటి
భారత్‌లో మత స్వేచ్ఛ పరిస్థితి దిగజారుతోందంటూ అమెరికాకు చెందిన 'అంతర్జాతీయ మత స్వేచ్ఛపై యూఎస్ కమిషన్' (USCIRF) చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. మతపరమైన కారణాలతో భారత్‌లో అరెస్టులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ.. 2020లో దేశ రాజధానిలో చోటుచేసుకున్న అల్లర్ల కేసులో అరెస్టయిన షార్జీల్ ఇమామ్ ఫొటోను ఆ కమిషన్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. మత స్వేచ్ఛ కోసం గళమెత్తినందుకే అతడిని కొన్నేళ్లుగా నిర్బంధించారని ఆరోపించింది. ఈ వ్యాఖ్యలను అమెరికాలోని భారత రాయబారి వినయ్ క్వాత్రా తీవ్రంగా ఖండించారు.
వివరాలు
ఉచిత సలహాలు ఇవ్వడం మానుకోవాలి..
ఇతరులకు నీతులు చెప్పేవారు ముందుగా తమ దేశంలోని పక్షపాత ధోరణులపై ఆత్మపరిశీలన చేసుకోవాలని వినయ్ క్వాత్రా యూఎస్‌సీఐఆర్‌ఎఫ్‌కు సూచించారు.
ఇకనైనా ఉచిత సలహాలు ఇవ్వడం మానుకోవాలని చురకలు అంటించారు.
భారత పౌరుల రాజ్యాంగ హక్కులపై మాట్లాడేందుకు, తీర్పులు చెప్పేందుకు ఆ కమిషన్‌కు ఎలాంటి అర్హత లేదని స్పష్టం చేశారు.
వివరాలు
పక్షపాత ధోరణితో కూడిన అంచనాలు..
యూఎస్‌సీఐఆర్‌ఎఫ్‌కు అలవాటైన పక్షపాత ధోరణి, తప్పుడు సమాచారంతో కూడిన అంచనాలు భారత్‌లోని మత స్వేచ్ఛను, రాజ్యాంగ నిబద్ధతను తగ్గించలేవని వినయ్ క్వాత్రా పేర్కొన్నారు.
కొన్నేళ్లుగా భారత్ విషయంలో ఆ కమిషన్ వక్రీకరించిన సమాచారాన్ని, ఎంచుకున్న అంశాలను మాత్రమే ప్రదర్శిస్తోందని విమర్శించారు.
వాస్తవాల కంటే సందేహాస్పదమైన, భావజాలపరమైన కథనాలపై ఆధారపడుతోందని మండిపడ్డారు.
కాగా మత స్వేచ్ఛ అంశంపై యూఎస్‌సీఐఆర్‌ఎఫ్ భారత్ పట్ల పక్షపాత వైఖరిని ప్రదర్శిస్తోందని కేంద్ర ప్రభుత్వం కొన్నేళ్లుగా ఆరోపిస్తోంది.