LOADING...
US-China: ట్రంప్-జిన్‌పింగ్‌తో చర్చల్లో పురోగతి.. చైనాపై 10 శాతం సుంకాల తగ్గింపు 
ట్రంప్-జిన్‌పింగ్‌తో చర్చల్లో పురోగతి.. చైనాపై 10 శాతం సుంకాల తగ్గింపు

US-China: ట్రంప్-జిన్‌పింగ్‌తో చర్చల్లో పురోగతి.. చైనాపై 10 శాతం సుంకాల తగ్గింపు 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 30, 2025
11:38 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న ఈ సమయంలో, ఇరు దేశాల అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, షీ జిన్‌పింగ్ భేటీ కావడం అంతర్జాతీయ స్థాయిలో విశేష ఆసక్తిని రేకెత్తించింది. దక్షిణ కొరియాలో గురువారం జరిగిన ఈ సమావేశం దాదాపు రెండు గంటల పాటు కొనసాగింది. ఇరువురు నేతలు పలు ప్రధాన అంశాలపై లోతైన చర్చలు జరిపారు. భేటీ అనంతరం ట్రంప్ ముఖ్య ప్రకటన చేస్తూ, చైనా మీద విధించిన టారిఫ్‌లను 10 శాతం మేర తగ్గిస్తున్నట్లు తెలిపారు.

టారిఫ్

ఫెంటనిల్‌ టారిఫ్‌ల తగ్గింపు.. 

ట్రంప్ మాట్లాడుతూ.. "జిన్‌పింగ్‌తో మా చర్చలు చాలా సానుకూలంగా జరిగాయి. ఫెంటనిల్ తయారీలో ఉపయోగించే ముడి పదార్థాల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు జిన్‌పింగ్ కృషి చేస్తారని నాకు విశ్వాసం ఉంది. అందుకే ఫెంటనిల్ సంబంధిత ఉత్పత్తులపై చైనాపై విధించిన 20% టారిఫ్‌ను 10%కి తగ్గించాలని నిర్ణయించాం" అన్నారు. దీని ఫలితంగా బీజింగ్‌పై మొత్తం సుంకాలు 57% నుంచి 47%కు తగ్గనున్నాయని వివరించారు. అలాగే,అమెరికా సోయాబీన్ ఉత్పత్తుల కొనుగోళ్లను చైనా మళ్లీ ప్రారంభించేందుకు అంగీకరించిందని కూడా వెల్లడించారు.

రేర్‌ ఎర్త్

రేర్‌ ఎర్త్‌పై కుదిరిన డీల్‌.. 

ఇంకా, అరుదైన ఖనిజాల సరఫరా విషయంలోనూ ఇరుదేశాలు పరస్పర అంగీకారానికి వచ్చినట్లు ట్రంప్ తెలిపారు. ఇకపై చైనా నుంచి అమెరికాకు ఈ రేర్ ఎర్త్ ఖనిజాల ఎగుమతులు నిరాటంకంగా జరుగుతాయని, ఈ మేరకు ఒక సంవత్సర కాలపరిమితి గల ఒప్పందం కుదిరిందని చెప్పారు. ఇటీవల ఈ ఖనిజాలపై అమెరికా విధించబోయిన 100% సుంకాల హెచ్చరికల నేపథ్యంలో, ఈ ఒప్పందం చైనాకు ఉపశమనాన్ని తీసుకువచ్చినట్లయింది. ట్రంప్ మాట్లాడుతూ, చైనాతో పూర్తి స్థాయి వాణిజ్య ఒప్పందం త్వరలోనే కుదరనుందని సూచించారు.

12/10

జిన్‌పింగ్‌కు 12/10.. 

భేటీ అనంతరం ట్రంప్,జిన్‌పింగ్‌ను ప్రశంసిస్తూ.. "ఆయన గొప్ప నాయకుడు. 10లో 12 మార్కులు ఇవ్వగలను" అని అన్నారు. అలాగే, ఉక్రెయిన్-రష్యా యుద్ధ విషయంలో అమెరికాతో కలిసి పనిచేయడానికి చైనా అంగీకరించిందని తెలిపారు. వచ్చే సంవత్సరం ఏప్రిల్‌లో తాను చైనాను సందర్శిస్తానని, ఆ తరువాత జిన్‌పింగ్ కూడా అమెరికా పర్యటనకు వస్తారని ట్రంప్ వెల్లడించారు.