LOADING...
Pete Hegseth: ఇరాన్‌పై దాడుల ముందు పెట్టుబడుల హంగామా? అమెరికా రక్షణమంత్రి పీట్ హెగ్సెత్‌పై అనుమానాలు
అమెరికా రక్షణమంత్రి పీట్ హెగ్సెత్‌పై అనుమానాలు

Pete Hegseth: ఇరాన్‌పై దాడుల ముందు పెట్టుబడుల హంగామా? అమెరికా రక్షణమంత్రి పీట్ హెగ్సెత్‌పై అనుమానాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 31, 2026
12:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు రోజు రోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా రక్షణమంత్రి పీట్ హెగ్సెత్‌(Pete Hegseth)చుట్టూ సంచలనాత్మక పరిణామం వెలుగులోకి వచ్చింది. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్‌ (US-Israel strikes on Iran) సైనిక చర్యలు ప్రారంభం కావడానికి కొన్ని వారాల ముందు ఆయనకు అనుబంధంగా ఉన్న ఒక బ్రోకర్‌ రక్షణ రంగ కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. ఈ విషయాన్ని విశ్వసనీయ వర్గాల ఆధారంగా ఫైనాన్షియల్ టైమ్స్ వెల్లడించింది. సమాచారం ప్రకారం, మోర్గాన్ స్టాన్లీతో పని చేస్తున్న ఆ బ్రోకర్ ఈ ఏడాది ఫిబ్రవరిలోనే బ్లాక్‌రాక్ ను సంప్రదించాడు. బ్లాక్‌రాక్‌కు చెందిన డిఫెన్స్ ఇండస్ట్రియల్స్ యాక్టివ్ ఈటీఎఫ్‌లలో మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టే అవకాశాలపై అతడు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

వివరాలు 

యుద్ధానికి ముందుపెట్టుబడుల ప్రయత్నాలు

ఈ అంశంపై అంతర్గతంగా కూడా చర్చలు జరిగినట్లు సమాచారం. అయితే, ఆ సమయంలో ఈ ఈటీఎఫ్‌లను మోర్గాన్ స్టాన్లీ ద్వారా కొనుగోలు చేసే అవకాశం లేకపోవడంతో పెట్టుబడుల ప్రక్రియ ముందుకు సాగలేదని తెలుస్తోంది. తర్వాత పీట్ హెగ్సెత్‌కు చెందిన ఆ బ్రోకర్ మరే ఇతర రక్షణ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారా లేదా అన్నది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. కానీ ముఖ్యంగా గమనించాల్సింది ఏమిటంటే.. యుద్ధానికి ముందు ఈ పెట్టుబడుల ప్రయత్నాలు జరగడం అనుమానాలకు తావిస్తోంది. ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు ఇటీవల చేసిన వ్యాఖ్యల్లో పీట్ హెగ్సెత్ ప్రభావంతోనే తాను యుద్ధ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పడం మరింత చర్చనీయాంశమైంది. అయినప్పటికీ ఈ ఆరోపణలపై ఇప్పటివరకు రక్షణమంత్రి గానీ, పెంటగాన్ గానీ స్పందించలేదు.

వివరాలు 

రక్షణ, భద్రత రంగాల్లో పనిచేసే కంపెనీల్లో పెట్టుబడులు

ఇక బ్లాక్‌రాక్‌ నిర్వహిస్తున్న డిఫెన్స్ ఇండస్ట్రియల్స్ యాక్టివ్ ఈక్విటీ ఫండ్ విలువ సుమారు 3.2 బిలియన్ డాలర్లు. ఈ ఫండ్ ద్వారా రక్షణ, భద్రత రంగాల్లో పనిచేసే కంపెనీల్లో పెట్టుబడులు పెట్టబడతాయి. ముఖ్యంగా ఏరోస్పేస్, సెక్యూరిటీ టెక్నాలజీ, డిఫెన్స్ కాంట్రాక్టింగ్ రంగాల్లో ప్రభుత్వ ఖర్చులు పెరిగే కొద్దీ ఈ కంపెనీలు లాభపడే అవకాశం ఉంది. ఈ ఫండ్‌తో కలిసి RTX కార్పొరేషన్, లాక్‌హీడ్ మార్టిన్ వంటి ప్రముఖ సంస్థలు పని చేస్తున్నాయి. తక్కువ ఫీజులు, పన్ను ప్రయోజనాలు ఉండటం వల్ల ఇలాంటి ఈటీఎఫ్‌లకు మదుపర్ల నుంచి భారీ స్పందన వస్తోందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

Advertisement