Page Loader
Deportation: అమెరికా డిపోర్టేషన్ ఆపరేషన్‌.. 682 మంది భారతీయుల స్వదేశానికి రవాణా!
అమెరికా డిపోర్టేషన్ ఆపరేషన్‌.. 682 మంది భారతీయుల స్వదేశానికి రవాణా!

Deportation: అమెరికా డిపోర్టేషన్ ఆపరేషన్‌.. 682 మంది భారతీయుల స్వదేశానికి రవాణా!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 04, 2025
05:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టినప్పటి నుంచి డొనాల్డ్‌ ట్రంప్‌ అక్రమ వలసదారులను కట్టడి చేసేందుకు కఠిన చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా, సరైన పత్రాలు లేకుండా అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించిన వారిని గుర్తించి, స్వదేశాలకు పంపించే ప్రక్రియను వేగవంతం చేశారు. ఈ చర్యల క్రమంలో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 682 మంది భారతీయులు బహిష్కరణ (deportation)కు గురయ్యారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ శుక్రవారం పార్లమెంట్‌లో వెల్లడించారు. బహిష్కరణకు గురవుతున్న వారిలో పత్రాలు లేని వారు ఎక్కువగా ఉండడంతో, న్యాయపరమైన సమస్యలు ఎదుర్కొంటున్న భారతీయులకు మద్దతుగా ప్రభుత్వం చేపడుతున్న చర్యలను కూడా మంత్రి ప్రస్తావించారు.

Details

సరిహద్దుల వద్దనే గుర్తించి అరెస్టు

ఈ బహిష్కరణకు గురైన వారిలో ఎక్కువ మంది చట్టవిరుద్ధంగా అమెరికాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన వారే కావడం గమనార్హం. అయితే వారిని అమెరికా సరిహద్దుల వద్దనే గుర్తించి, అరెస్ట్ చేసి, వెరిఫికేషన్ అనంతరం భారత్‌కు తిరిగి పంపించారు. అయితే ఈ చర్యల వల్ల అమెరికాలో నివసించే భారతీయుల నుండి వచ్చే రెమిటెన్స్‌ (విదేశాల్లో ఉన్న భారతీయులు స్వదేశానికి పంపే డబ్బు)పై ఎటువంటి ప్రభావం ఉండదని మంత్రి స్పష్టం చేశారు.