Greene: ఇరాన్‌పై అణ్వాయుధాలు ప్రయోగించేలా ట్రంప్ సర్కారు వ్యూహాలు: గ్రీన్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా మాజీ కాంగ్రెస్ సభ్యురాలు,రిపబ్లికన్ పార్టీ నాయకురాలు మర్జోరీ టేలర్ గ్రీన్ సంచలన ఆరోపణలు చేశారు. అణ్వాయుధాల వ్యాప్తిని నియంత్రించడమే తమ లక్ష్యమని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెబుతున్నప్పటికీ.. ఇరాన్‌పై అణ్వాయుధాలు ప్రయోగించేందుకు ఆయన ప్రభుత్వం రహస్యంగా సన్నాహాలు చేస్తోందని పేర్కొన్నారు. త్వరలోనే అణుదాడులు చేపట్టే దిశగా ట్రంప్ యంత్రాంగం ప్రణాళికలు రూపొందిస్తోందని ఆరోపించారు. ఈవ్యవహారంపై అమెరికా ప్రభుత్వానికి చెందిన ఉన్నతస్థాయి అధికారులు వ్యూహాత్మక సమావేశాలు నిర్వహిస్తున్నారని గ్రీన్ తెలిపారు. ఇరాన్‌పై అణ్వాయుధాలను ఉపయోగిస్తే దాని ప్రభావం ఆ దేశానికే పరిమితం కాదని హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా భారీసంఘర్షణ చెలరేగడంతో పాటు ఆర్థిక మాంద్యం తలెత్తే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికైనా ప్రజలు ముందుకు వచ్చి ట్రంప్ తీసుకునే ఇటువంటి చర్యలను అడ్డుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.
వివరాలు
హిరోషిమా, నాగసాకి పరిస్థితి రాకూడదు..
1945లో జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి నగరాలపై అమెరికా అణుబాంబులు ప్రయోగించిన ఘటనను మర్జోరీ టేలర్ గ్రీన్ గుర్తుచేశారు.
ఆ ఘటన జరిగి దశాబ్దాలు గడిచినా.. అక్కడి ప్రజలు ఇప్పటికీ రేడియేషన్ ప్రభావంతో అనారోగ్య సమస్యలు, క్యాన్సర్, పుట్టుకతో వచ్చే లోపాలు వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
అదే తరహా పరిస్థితి ఇరాన్‌లోనూ ఏర్పడే ప్రమాదం ఉందని గ్రీన్ హెచ్చరించారు.
అణ్వాయుధాల వినియోగం వల్ల కలిగే పరిణామాలు తరతరాలపాటు కొనసాగుతాయని పేర్కొంటూ.. ఇలాంటి నిర్ణయాలను అడ్డుకోవాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.
వివరాలు
యుద్ధ నీడలో జీవించలేం..
మరోవైపు,యుద్ధ పరిస్థితులు కొనసాగుతున్నంతకాలం ప్రజలు భయాందోళనల మధ్య జీవించాల్సి వస్తుందని ఇరాన్ మాజీ అధ్యక్షుడు మహమ్మద్ ఖతామీ పేర్కొన్నారు.
ప్రస్తుత పరిస్థితులు తొలగిపోయి దేశంలో శాంతియుత వాతావరణం ఏర్పడేలా ప్రభుత్వం దౌత్య మార్గాలను అనుసరించాలని సూచించారు.
ఇన్నాళ్లుగా బాహ్య ఒత్తిళ్లను తట్టుకుని ఇరాన్ ప్రభుత్వం కొనసాగినప్పటికీ.. యుద్ధ పరిస్థితులు ఇదే విధంగా కొనసాగితే ప్రజల్లో అసంతృప్తి మరింత పెరిగే అవకాశం ఉందని ఖతామీ అభిప్రాయపడ్డారు.
వివరాలు
యుద్ధ నీడలో జీవించలేం..
దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొనేలా శాంతి ప్రయత్నాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
ఇదిలా ఉండగా.. అమెరికా, ఇజ్రాయెల్ వద్ద అణ్వాయుధాలు ఉన్నంతకాలం ఇరాన్ కూడా వాటిని సమకూర్చుకునే ప్రయత్నాలు కొనసాగిస్తుందని ఆ దేశ సీనియర్ కమాండర్ జనరల్ అహ్మద్ వాహిది పేర్కొన్నట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి.
ఈ వ్యాఖ్యలు ప్రాంతంలో అణ్వాయుధాలపై నెలకొన్న ఆందోళనలను మరింత పెంచుతున్నాయి.