US-Iran War: లారక్ ద్వీపంపై అమెరికా డ్రోన్ దాడులు.. ప్రతీకారం తప్పదన్న ఇరాన్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా, ఇరాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. ఇరాన్‌కు చెందిన లారక్ ద్వీపంపై అమెరికా సైనిక దళాలు డ్రోన్ దాడులు నిర్వహించాయి. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో సముద్రపు మైన్లను ఏర్పాటు చేసేందుకు ఇరాన్ ప్రయత్నించడంతో ఈ చర్య తీసుకున్నట్లు అమెరికా వెల్లడించింది. తాజా ఘటనతో పశ్చిమాసియాలో మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
వివరాలు
మైన్‌లతో కూడిన రాకెట్లకు సిద్ధమవుతున్నట్లు గుర్తింపు
ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్(ఐఆర్‌జీసీ)కు చెందిన బలగాలు హర్మూజ్ జలసంధిలోకి సముద్రపు మైన్లతో కూడిన రాకెట్లను ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నట్లు గుర్తించామని అమెరికా తెలిపింది.
యూఎస్ సెంట్రల్ కమాండ్ అధికార ప్రతినిధి టిమ్ హాకిన్స్ ఈ దాడిని ధ్రువీకరించారు.
ఈ ప్రాంతంలో పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని, వాణిజ్య నౌకల స్వేచ్ఛాయుత రాకపోకలను కాపాడేందుకు అవసరమైన చర్యలకు సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు.
రెండు ఇరాన్ లాంచర్లు ధ్వంసం
అమెరికా జరిపిన దాడిలో రెండు ఇరానియన్ లాంచర్లను ధ్వంసం చేసినట్లు అధికారులు వెల్లడించారు.
గత నెలరోజుల వ్యవధి తర్వాత ఇరాన్‌కు చెందిన లక్ష్యాలపై అమెరికా దాడి చేయడం ఇదే మొదటిసారి.
హర్మూజ్ జలసంధిలో ఇరాన్ కార్యకలాపాలపై అమెరికా నిఘా కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈదాడి చోటుచేసుకుంది.
వివరాలు
అమెరికా-ఇజ్రాయెల్ ఉమ్మడి దాడి: ఐఆర్‌జీసీ
తాజా దాడిని ఇరాన్‌కు చెందిన ఐఆర్‌జీసీ కూడా ధ్రువీకరించింది. అయితే ఇది అమెరికా, ఇజ్రాయెల్ కలిసి చేసిన దాడిగా ఆరోపించింది.
ఈ దాడిలో పలువురు సైనిక సిబ్బందితో పాటు సాధారణ పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది.
తమపై దాడికి పాల్పడినవారికి కఠిన శిక్ష తప్పదని, ప్రతీకారం తీర్చుకుంటామని ఐఆర్‌జీసీ హెచ్చరించింది.
ఇద్దరు మృతి.. మరో ఇద్దరికి గాయాలు
అమెరికా డ్రోన్ దాడిలో కనీసం ఇద్దరు మరణించగా, మరో ఇద్దరు గాయపడినట్లు ఇరాన్‌కు చెందిన అనధికారిక వార్తా సంస్థలు వెల్లడించాయి.
అయితే మృతులు, క్షతగాత్రుల వివరాలపై పూర్తి అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.
వివరాలు
మైన్ల తొలగింపు పూర్తయిన కొద్దిరోజుల్లోనే..
ఇటీవల హర్మూజ్ జలసంధిలోని అంతర్జాతీయ షిప్పింగ్ మార్గాల్లో ఏర్పాటు చేసిన సముద్రపు మైన్లను అమెరికా సైన్యం తొలగించింది.
ఈ ఆపరేషన్ పూర్తయిన కొద్ది రోజులకే ఇరాన్ మరోసారి మైన్లను అమర్చేందుకు ప్రయత్నించినట్లు అమెరికా పేర్కొంది. దీంతో లారక్ ద్వీపంపై దాడి చేసినట్లు తెలిపింది.
ఇరాన్‌కు ట్రంప్ ముందే హెచ్చరిక
హర్మూజ్ జలసంధిలో సముద్రపు మైన్లను ఏర్పాటు చేసే ప్రయత్నాల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలోనే ఇరాన్‌ను హెచ్చరించారు.
మైన్ల ఏర్పాటుపై తమది 'జీరో టాలరెన్స్' విధానమని స్పష్టం చేశారు.
ఇలాంటి చర్యలకు పాల్పడే ఏ నౌకనైనా తక్షణమే ధ్వంసం చేస్తామని హెచ్చరించారు.
తాజా దాడితో అమెరికా-ఇరాన్ మధ్య ఇప్పటికే ఉన్న విభేదాలు మరింత తీవ్రరూపం దాల్చినట్లు కనిపిస్తోంది.