LOADING...
Iranian ships: హర్మూజ్‌పై అమెరికా సడలింపు.. అంతర్జాతీయ జలాల్లోకి దూసుకెళ్లిన ఇరాన్ నౌకలు
హర్మూజ్‌పై అమెరికా సడలింపు.. అంతర్జాతీయ జలాల్లోకి దూసుకెళ్లిన ఇరాన్ నౌకలు

Iranian ships: హర్మూజ్‌పై అమెరికా సడలింపు.. అంతర్జాతీయ జలాల్లోకి దూసుకెళ్లిన ఇరాన్ నౌకలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 16, 2026
02:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం అధికారికంగా ఖరారయ్యే దిశగా అడుగులు పడుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇంతకాలం హర్మూజ్ జలసంధిని దిగ్బంధించిన అమెరికా తన వైఖరిలో సడలింపు చూపడంతో కనీసం ఐదు ఇరాన్ నౌకలు ఆ జలసంధిని దాటి అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు ప్రారంభమైన తర్వాత హర్మూజ్ జలసంధిలో రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. అమెరికా, దాని మిత్రదేశాల నౌకలను ఇరాన్ అడ్డుకోగా, ఇరాన్ పోర్టుల నుంచి రాకపోకలు సాగించే నౌకలను అమెరికా నిలువరించింది. ఇరాన్, అమెరికా పరస్పరం హర్మూజ్ జలసంధిపై దిగ్బంధన చర్యలు చేపట్టడంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా వ్యవస్థ దెబ్బతిని అనేక దేశాలు ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి.

వివరాలు

హర్మూజ్ జలసంధిని దాటి ప్రయాణం

ఇదిలా ఉండగా అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందానికి సంబంధించిన ఫ్రేమ్‌వర్క్ (ఎంఓయూ)పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించిన ఆ దేశ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాగేర్ ఘాలిబఫ్ డిజిటల్ రూపంలో సంతకాలు చేసినట్లు సమాచారం. ఈ ఒప్పందానికి సంబంధించిన అధికారిక కార్యక్రమం శుక్రవారం స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో నిర్వహించనున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఇరాన్ నౌకలు హర్మూజ్ జలసంధిని దాటి ప్రయాణం కొనసాగించినట్లు తెలుస్తోంది. శాంతి ఒప్పందంపై ప్రకటన చేసిన సమయంలోనే హర్మూజ్ దిగ్బంధనాన్ని ఎత్తివేస్తున్నట్లు ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించగా, ప్రస్తుతం ఆ ప్రకటన అమల్లోకి వచ్చినట్లుగా కనిపిస్తోంది.

వివరాలు

అంతర్జాతీయ ఆంక్షల నుంచి ఉపశమనం

ఇక అమెరికా-ఇరాన్ మధ్య జరగనున్న చర్చలపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ కీలక వివరాలు వెల్లడించారు. ఈ చర్చలు రెండు దశల్లో జరుగుతాయని ఆయన తెలిపారు. తొలి దశలో హర్మూజ్ జలసంధి, అమెరికా విధించిన దిగ్బంధనం, అలాగే ఇరాన్ పునర్నిర్మాణ అంశాలపై ప్రధానంగా చర్చలు జరుగుతాయని పేర్కొన్నారు. రెండో దశలో అణు కార్యక్రమాలకు సంబంధించిన అంశాలు, అంతర్జాతీయ ఆంక్షల నుంచి ఉపశమనం వంటి విషయాలు చర్చకు వస్తాయని చెప్పారు. అయితే లెబనాన్‌లో ఇజ్రాయెల్ సైనిక కార్యకలాపాలే ఈశాంతి చర్చల భవిష్యత్తును నిర్ణయిస్తాయని అరాగ్చీ వ్యాఖ్యానించారు. ఈఅంశం ట్రంప్ యంత్రాంగానికి బాగా తెలుసునని పేర్కొన్న ఆయన, ఇజ్రాయెల్‌ను నియంత్రించే బాధ్యత అమెరికాపైనే ఉందని, అది అధ్యక్షుడు ట్రంప్‌కు పెద్ద సవాలుగా మారబోతోందని అభిప్రాయపడ్డారు.

Advertisement