
US embassy: చోరీలు,దోపిడీలు వంటి నేరాలకు పాల్పడేవారికి.. అమెరికా ఎంబసీ వార్నింగ్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా వీసాలకు దరఖాస్తు చేసే భారతీయుల కోసం అమెరికా రాయబార కార్యాలయం తాజా హెచ్చరికలను జారీ చేసింది. చోరీలు, దోపిడీలు వంటి నేరాలకు పాల్పడేవారిపై శాశ్వత ఆంక్షలు విధించే అవకాశముందని, వారు ఇకపై అగ్రరాజ్యం వైపు అడుగుపెట్టలేని పరిస్థితి ఉత్పన్నమవుతుందని ఈ హెచ్చరికలో స్పష్టం చేసింది. ఇటీవల అమెరికాలో ఓ భారతీయ పర్యాటకురాలు ఒక దుకాణంలో దొంగతనం చేస్తూ పట్టుబడిన ఘటన నేపథ్యంలో ఈ హెచ్చరిక వెలువడింది.
వివరాలు
విదేశీయులు కూడా అమెరికా చట్టాలను ఖచ్చితంగా పాటించాలి
''అమెరికాలో దాడులు,దోపిడీలు,చోరీలు వంటి నేరాలకు పాల్పడిన పక్షంలో న్యాయపరమైన చిక్కుల్లో పడతారు.అంతే కాకుండా,మీ వీసా రద్దయ్యే ప్రమాదం ఉంది.అలాగే భవిష్యత్తులో అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసుకునే హక్కును కూడా కోల్పోతారు.అమెరికా శాంతి భద్రతలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది. విదేశీయులు కూడా అమెరికా చట్టాలను ఖచ్చితంగా పాటించాలని ఆశిస్తుంది,'' అంటూ అమెరికా రాయబార కార్యాలయం తమ సోషల్‌మీడియా పోస్ట్‌లో వెల్లడించింది. ఇక వివరాల్లోకి వెళితే, భారత్‌కు చెందిన ఓ పర్యాటకురాలు అమెరికాలోని ఇల్లినాయిస్‌లో 'టార్గెట్' రిటైల్ స్టోర్‌లో దొంగతనం చేస్తూ పట్టుబడింది. ఆ మహిళ దాదాపు ఏడు గంటలపాటు స్టోర్‌లో తిరుగుతూ ఉండటంతో సిబ్బందికి అనుమానం వచ్చింది. దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
వివరాలు
రూ.1.11 లక్షల విలువైన వస్తువులు దొంగతనం
పోలీసులు వచ్చేముందే ఆమె వెనుక గేటు దారి గుండా బయటకు వెళ్లే ప్రయత్నం చేసింది. అయితే అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 1,300 డాలర్ల (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.1.11 లక్షల విలువైన) వస్తువులను ఆమె దొంగిలించేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో విరాక్ అయ్యాయి . ఆమెపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం.