LOADING...
Scott Bessent: రష్యా చమురు కొనుగోళ్లపై ఆంక్షలు సడలింపు.. అమెరికా మంత్రి కీలక వ్యాఖ్యలు
అమెరికా మంత్రి కీలక వ్యాఖ్యలు

Scott Bessent: రష్యా చమురు కొనుగోళ్లపై ఆంక్షలు సడలింపు.. అమెరికా మంత్రి కీలక వ్యాఖ్యలు

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 23, 2026
10:31 am

ఈ వార్తాకథనం ఏంటి

రష్యా చమురు కొనుగోళ్లపై విధించిన ఆంక్షలను అమెరికా మరోసారి సడలించిన నేపథ్యంలో ఆ దేశ ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. చమురు కొరతను ఎదుర్కొంటున్న దేశాల అభ్యర్థనలను పరిగణలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. సముద్ర మార్గం ద్వారా రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడానికి అనుమతిస్తూ, నెల రోజుల పాటు మినహాయింపును అమెరికా పొడిగించింది. ఇటీవల నిర్వహించిన ప్రపంచ ఆర్థిక సమావేశాల సందర్భంగా ఈ సడలింపుల కోసం పలు దేశాలు తమను సంప్రదించినట్లు బెసెంట్ తెలిపారు. ఇంధన కొరతతో ఇబ్బందులు పడుతున్న పదికి పైగా దేశాలు రష్యా చమురుపై ఆంక్షలను సడలించాలని కోరినట్లు చెప్పారు.

వివరాలు 

వివిధ దేశాలు అమెరికాను సంప్రదించాయన్న మంత్రి స్కాట్ బెసెంట్

ఈ అభ్యర్థనల నేపథ్యంలోనే ఆంక్షల సడలింపును మరో నెల రోజుల పాటు కొనసాగించినట్లు వివరించారు. ఇదిలా ఉండగా, ఇరాన్‌తో దాదాపు రెండు నెలలుగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రష్యా నుంచి చమురు కొనుగోళ్లకు భారత్‌ వంటి దేశాలకు కూడా అమెరికా అనుమతి ఇచ్చింది. ప్రారంభంలో ఈ మినహాయింపులను పొడిగించబోమని తెలిపిన అమెరికా, తర్వాత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నెల రోజుల పాటు ఊరట కల్పించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు సరఫరా అంతరాయాలు తగ్గించేందుకు, ధరలను స్థిరంగా ఉంచేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు బెసెంట్ స్పష్టం చేశారు.

Advertisement