Trump: ట్రంప్‌కు షాక్.. ఇరాన్‌పై యుద్ధ అధికారాలకు అమెరికా సభ బ్రేక్
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్‌పై మరిన్ని సైనిక చర్యలు చేపట్టకుండా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ప్రతినిధుల సభ అడ్డుకట్ట వేసింది. ఆయన యుద్ధ అధికారాలను పరిమితం చేసే తీర్మానాన్ని బుధవారం 215-208 ఓట్ల తేడాతో సభ ఆమోదించింది. అయితే ఈ నిర్ణయాన్ని ట్రంప్ తీవ్రంగా ఖండించారు. తీర్మానానికి మద్దతిచ్చిన వారిని ఆయన దేశద్రోహులుగా అభివర్ణించారు. సభ ఆమోదించిన తీర్మానం ప్రకారం పర్షియన్ గల్ఫ్‌లో మోహరించిన అమెరికా బలగాలను ట్రంప్ వెనక్కి పిలిపించాల్సి ఉంటుంది. ఒకవేళ సైనిక చర్యలు కొనసాగించాలంటే ముందుగా అమెరికా కాంగ్రెస్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
వివరాలు
తీర్మానం రాజ్యాంగ విరుద్ధం: శ్వేతసౌధం
ఈ అంశంపై ట్రంప్ స్పందిస్తూ.. ''బుధవారం పూర్తిగా అర్థరహిత ఓటింగ్ జరిగింది. నలుగురు రిపబ్లికన్ సభ్యులతో పాటు డెమోక్రాట్లు కలిసి నా యుద్ధ అధికారాలను కట్టడి చేశారు. ఇరాన్‌తో యుద్ధ పరిస్థితులను ముగించే ప్రయత్నాలు జరుగుతున్న సమయంలోనే ఈ తీర్మానాన్ని తీసుకొచ్చారు. అలాంటి వారిని దేశద్రోహులు కాక మరేమంటారు'' అని గురువారం వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో ఈ తీర్మానం రాజ్యాంగ విరుద్ధమని శ్వేతసౌధం కూడా ప్రకటించింది.
వివరాలు
నేడు భారత్‌కు భారతీయుడి మృతదేహం
కువైట్ విమానాశ్రయంపై బుధవారం జరిగిన దాడిలో మరణించిన భారతీయుడి మృతదేహం శుక్రవారం భారత్‌కు చేరుకోనుంది. అదే ఘటనలో గాయపడిన 13 మంది భారతీయులు ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు.
వివరాలు
కాల్పుల విరమణకు హెజ్‌బొల్లా నిరాకరణ
ఇజ్రాయెల్, లెబనాన్‌ల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని హెజ్‌బొల్లా తిరస్కరించింది. ఇజ్రాయెల్ బలగాలు లెబనాన్ భూభాగం నుంచి పూర్తిగా వెనక్కి వెళ్లాలని డిమాండ్ చేసింది. ఇటీవల ఇజ్రాయెల్ దాడుల్లో నలుగురు మరణించిన నేపథ్యంలో హెజ్‌బొల్లా ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు కాల్పుల విరమణ ఒప్పందాన్ని లెబనాన్‌కూ వర్తింపజేయాలని ఇరాన్ కోరుతోంది. ఇదిలా ఉండగా, లెబనాన్‌లో జరిగిన మరో దాడిలో సెర్బియాకు చెందిన ఐరాస శాంతి పరిరక్షణ బృంద సభ్యుడు మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు.