Page Loader
Pakistan:పాకిస్థాన్ బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమానికి సహకరిస్తున్న నాలుగు సంస్థలపై అమెరికా ఆంక్షలు 
పాకిస్థాన్ బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమానికి సహకరిస్తున్న నాలుగు సంస్థలపై అమెరికా ఆంక్షలు

Pakistan:పాకిస్థాన్ బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమానికి సహకరిస్తున్న నాలుగు సంస్థలపై అమెరికా ఆంక్షలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 19, 2024
10:28 am

ఈ వార్తాకథనం ఏంటి

దీర్ఘశ్రేణి క్షిపణి టెక్నాలజీ వ్యాప్తికి సహకరిస్తున్నాయని అమెరికా (USA) పాకిస్థాన్ (Pakistan) కు చెందిన నాలుగు కీలక సంస్థలపై ఆంక్షలు విధించింది. బుధవారం అమెరికా విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో ఈ విషయం వెల్లడించింది. ఇందులో పాక్‌ ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్‌ డెవలప్‌మెంట్‌ కాంప్లెక్స్ (ఎన్‌డీసీ) కూడా ఉన్నది. ఈ సంస్థ పాక్‌ బాలిస్టిక్‌ మిసైల్‌ ప్రోగ్రామ్‌కు సహకరిస్తుందని, సామూహిక విధ్వంసక ఆయుధాలు వ్యాప్తి చేసే పనిలో భాగమైందని అమెరికా ఆరోపించింది.

వివరాలు 

 ఆంక్షలపై స్పందించిన పాక్‌ ప్రభుత్వం 

పాక్‌లోని అక్తర్‌ సన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, అఫిలియేట్స్‌ ఇంటర్నేషనల్‌, రాక్‌సైడ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ వంటి మూడు ఇతర సంస్థలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఈ సంస్థలు కరాచీ కేంద్రంగా పనిచేస్తున్నాయి. ఎన్‌డీసీ, క్షిపణి ప్రయోగాలకు ఉపయోగించే వాహనాల చాసిస్‌లను, పరీక్షల కోసం అవసరమైన పరికరాలను కొనుగోలు చేస్తోందని, షాహిన్‌ శ్రేణి క్షిపణుల తయారీలో భాగస్వామిగా ఉందని విదేశాంగ శాఖ వెల్లడించింది. అక్తర్‌ అండ్‌ సన్స్‌ సంస్థ ఎన్‌డీసీ తయారుచేసే క్షిపణులకు అవసరమైన పరికరాలను సరఫరా చేస్తుందని, అఫిలియేట్‌ ఇంటర్నేషనల్‌ కూడా మిసైల్‌లో ఉపయోగించే పరికరాలను కొంటున్నదని చెప్పారు. మరోవైపు ఈ ఆంక్షలపై పాక్‌ ప్రభుత్వం స్పందించింది

వివరాలు 

బంగ్లాదేశ్‌లో మైనార్టీల మానవ హక్కుల ఉల్లంఘనలను అరికట్టడానికి చర్యలు

అవి దురదృష్టకరమని, పక్షపాతంతో కూడుకున్నవని పేర్కొంది. ఈ విధంగా సైనికపరమైన అసమానతలను సృష్టించడం ప్రాంతీయంగా అస్థిరతకు దారితీస్తుందని పాక్‌ అభిప్రాయపడింది. అదే సమయంలో,బంగ్లాదేశ్‌పై కూడా ఆంక్షలు విధించాలని అమెరికాకు అక్కడి కాంగ్రెస్‌ ప్రతినిధి శ్రీతానేదార్‌ విజ్ఞప్తి చేశారు. బంగ్లాదేశ్‌లో మైనార్టీల మానవ హక్కుల ఉల్లంఘనలను అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో,2024లో ప్రధాని షేక్‌ హసీనా రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిన తర్వాత,బంగ్లాదేశ్‌లో రాజకీయ హింస గణనీయంగా పెరిగింది. ''బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం మొదలైనప్పటి నుంచి హిందూ,బౌద్ధ,క్రిస్టియన్‌ మైనార్టీలు హింసకు గురవుతున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఈ హింస మరింత పెరిగింది. మన సహాయం ద్వారా బంగ్లాదేశ్‌లో శాంతియుత పరిష్కారం సాధించగలమని ఆశిస్తున్నాను'' అని శ్రీతానేదార్‌ పేర్కొన్నారు.