Iran: ఇరాన్ షాడో ఆయిల్ ఫ్లీట్,ట్యాంకర్ ఆపరేటర్లు,మేనేజర్లపై అమెరికా ఆంక్షలు ..భారత్‌పై ప్రభావమెంత..?
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్ నుండి చమురును ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు సరఫరా కాకుండా అడ్డుకునేందుకు అమెరికా చర్యలు చేపట్టింది.
ఈ నేపథ్యంలో, షాడో ట్యాంకర్లు, వాటి ఆపరేటర్లు, మేనేజర్లను లక్ష్యంగా చేసుకుని, అమెరికా తాజాగా ఆంక్షలు విధించింది.
ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ అధికారికంగా ప్రకటించింది.
ఈ జాబితాలో వివిధ దేశాలకు చెందిన 30 మంది వ్యక్తుల పేర్లు, ట్యాంకర్లు ఉన్నాయి.
భారతీయుల పేర్లు కూడా ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా ఇరాన్ చమురు విక్రయాలు, బ్రోకరేజీలలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు గుర్తించారు.
హాంకాంగ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) లోని చమురు బ్రోకర్లు, నేషనల్ ఇరానియన్ ఆయిల్ కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి.
వివరాలు
ఆంక్షలతో భారత్‌లోని కొన్ని కంపెనీలపై ప్రభావం
''ఇరాన్ లక్షల బారెల్ల చమురును ఎగుమతి చేయడానికి గోప్యంగా ట్యాంకర్లు, షిప్పింగ్ కంపెనీలు, బ్రోకర్లపై ఆధారపడుతోంది. ఈ మార్గంలో వచ్చిన ఆదాయాన్ని ఇతర దేశాలను అస్థిరపరిచే చర్యలకు వినియోగిస్తోంది. ఇరాన్ చమురు సరఫరా వ్యవస్థను దెబ్బతీయడానికి అమెరికా అన్ని అవకాశాలను ఉపయోగిస్తోంది. ఎవరైనా ఇరాన్‌తో చమురు లావాదేవీలు చేస్తే, వారు అమెరికా ఆంక్షల పరిధిలోకి వస్తారు'' అని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సాంట్ తెలిపారు.
ఈ తాజా ఆంక్షలతో భారత్‌లోని కొన్ని కంపెనీలు ప్రభావితమవనున్నాయి.
వీటిలో బీఎస్‌ఎం మారిటైమ్ లిమిటెడ్ లైబిలిటీ పార్టనర్‌షిప్,ఆస్టిన్‌షిప్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్,కాస్మోస్ లైన్స్ ఐఎన్‌సీ సంస్థలు ఉన్నాయి.
ఈ సంస్థలు ఉద్దేశపూర్వకంగానే ఇరాన్‌తో కలిసి చమురు రవాణా,కొనుగోలు,మార్కెటింగ్ వంటి కార్యకలాపాలకు పాల్పడినట్లు అమెరికా ఆరోపించింది.
వివరాలు
ఇరాన్‌పై మరింత ఆర్థిక ఒత్తిడి
అదనంగా,ఫ్లక్స్ మారిటైమ్ ఎల్‌ఎల్‌పీ అనే సంస్థ ఓ నౌకకు టెక్నికల్ మేనేజర్‌గా పనిచేసినట్లు గుర్తించారు.
ఆ నౌక లక్షల టన్నుల ఇరాన్ ముడి చమురును రవాణా చేసినట్లు అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది.
ఈసారి ఆంక్షల జాబితాలో ఇరాన్‌కు చెందిన ఆయిల్ టెర్మినల్స్ కంపెనీ కూడా చేరింది. ఈ సంస్థ వ్యాపారానికి సంబంధించిన అన్ని కార్యకలాపాలను పర్యవేక్షిస్తుందని అమెరికా పేర్కొంది.
ఇరాన్‌పై మరింత ఆర్థిక ఒత్తిడి తీసుకురావాలని అమెరికా ట్రెజరీ సెక్రటరీని ఆదేశిస్తూ, ఈ నెల ప్రారంభంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు.
అలాగే, విదేశాంగ శాఖ కూడా ఈ విషయాన్ని పర్యవేక్షించాలని ఆదేశించారు. ఇరాన్ చమురు ఎగుమతులను పూర్తిగా నిలిపివేయడమే లక్ష్యమని తెలిపారు.