India-US: చైనాకు చెక్.. క్రిటికల్ మినరల్స్‌పై భారత్-అమెరికా వ్యూహాత్మక అడుగు
ఈ వార్తాకథనం ఏంటి
క్రిటికల్ మినరల్స్ మార్కెట్‌లో చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టే దిశగా భారత్,అమెరికా తమ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయి. ఈ క్రమంలో అమెరికా-ఇండియా క్రిటికల్ మినరల్స్ సెక్యూరిటీ టాస్క్‌ఫోర్స్ తొలి సమావేశం గత వారం నిర్వహించారు. ఇరు దేశాలకు చెందిన 17 ప్రముఖ సంస్థల ప్రతినిధులు ఇందులో పాల్గొని కీలక ఖనిజాల మైనింగ్, ప్రాసెసింగ్,తయారీ,ఆధునిక సాంకేతికత,పెట్టుబడులు,సరఫరా గొలుసు బలోపేతంపై విస్తృతంగా చర్చించారు. గత నెలలో ఢిల్లీలో జరిగిన క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం సందర్భంగా కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్.జైశంకర్,అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మధ్య కుదిరిన కీలక ఒప్పందానికి కొనసాగింపుగానే ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.
వివరాలు
క్రిటికల్ మినరల్స్ సెక్యూరిటీ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు
సాంకేతిక, రక్షణ, స్వచ్ఛ ఇంధన రంగాలకు అత్యవసరమైన అరుదైన ఖనిజాల సరఫరా గొలుసును పటిష్టం చేయడమే ఈ భాగస్వామ్యం ప్రధాన లక్ష్యంగా ఇరు దేశాలు పేర్కొన్నాయి. క్వాడ్ సమావేశంలో కుదిరిన చారిత్రాత్మక వ్యూహాత్మక ఫ్రేమ్‌వర్క్ ఒప్పందం ప్రకారం క్రిటికల్ మినరల్స్, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, మైనింగ్, ప్రాసెసింగ్, రీసైక్లింగ్ రంగాల్లో భారత్, అమెరికా సంయుక్తంగా పనిచేయనున్నాయి. కొత్త ప్రాజెక్టులకు అవసరమైన నిధుల సమీకరణతో పాటు సాంకేతిక సహకారాన్ని కూడా పరస్పరం అందించనున్నాయి. ఈ లక్ష్యాల అమలుకు ప్రత్యేకంగా క్రిటికల్ మినరల్స్ సెక్యూరిటీ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశాయి.
వివరాలు
చైనాపై ఆధారపడటాన్ని తగ్గించాలని ఇరు దేశాల నిర్ణయం
టాస్క్‌ఫోర్స్ తొలి సమావేశంలో భవిష్యత్ సహకారం కోసం ఐదు కీలక రంగాలను గుర్తించారు. వీటిలో లిథియం శుద్ధి, బ్యాటరీల తయారీలో ఉపయోగించే కాథోడ్ పదార్థాల ఉత్పత్తి, బ్యాటరీ గ్రేడ్ సింథటిక్ గ్రాఫైట్ తయారీ, రేర్ ఎర్త్ ప్రాసెసింగ్,మాగ్నెట్ తయారీ, ఖనిజాల రీసైక్లింగ్ ఉన్నాయి. ఈ రంగాల్లో సంయుక్త పెట్టుబడులు, సాంకేతిక భాగస్వామ్యాలను ప్రోత్సహిస్తూ చైనాపై ఆధారపడటాన్ని తగ్గించాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. ప్రపంచవ్యాప్తంగా క్రిటికల్ మినరల్స్‌కు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో భారత్-అమెరికా ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం భవిష్యత్ పారిశ్రామిక, రక్షణ, స్వచ్ఛ ఇంధన రంగాలకు కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.