LOADING...
US-Iran: శాంతి ఒప్పందంపై కొత్త వివాదం.. ఇరాన్‌ వాదనలను ఖండించిన అమెరికా
శాంతి ఒప్పందంపై కొత్త వివాదం.. ఇరాన్‌ వాదనలను ఖండించిన అమెరికా

US-Iran: శాంతి ఒప్పందంపై కొత్త వివాదం.. ఇరాన్‌ వాదనలను ఖండించిన అమెరికా

వ్రాసిన వారు Sirish Praharaju
May 29, 2026
10:09 am

ఈ వార్తాకథనం ఏంటి

శాంతి ఒప్పందానికి సంబంధించిన ప్రతిపాదనల విషయంలో అమెరికా,ఇరాన్‌ దేశాలు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తూ చర్చలను కొనసాగిస్తున్నాయి. ఒప్పంద ముసాయిదాపై చర్చలు జరుగుతున్నాయని,తమపై విధించిన ఆంక్షలను ఎత్తివేయడంతో పాటు ప్రాంతంలోని బలగాలను వెనక్కి తీసుకుంటామని,హర్మూజ్‌ జలసంధి మార్గంలో రవాణాకు ఉన్న ఆటంకాలను తొలగిస్తామని అమెరికా హామీ ఇచ్చినట్లు ఇరాన్‌ బుధవారం వెల్లడించింది. అయితే ఈ వాదనలను అమెరికా పూర్తిగా ఖండించింది.ఇరాన్‌కు చెందిన టీవీ ఛానళ్లు ప్రసారం చేస్తున్న ఒప్పంద ముసాయిదా పూర్తిగా కల్పితమని శ్వేతసౌధం స్పష్టం చేసింది. ఇరాన్‌ ప్రభుత్వ నియంత్రణలో ఉన్న మాధ్యమాలు ప్రసారం చేస్తున్న అవగాహన పత్రం పూర్తిగా అవాస్తవమని, అక్కడి మాధ్యమాలు వాస్తవాలను ప్రసారం చేస్తాయని ఎవరూ నమ్మరని శ్వేతసౌధం సామాజిక మాధ్యమ వేదిక ద్వారా వెల్లడించింది.

వివరాలు 

యుద్ధం పునరావృతం కాదన్న ఇరాన్

అమెరికాతో మరోసారి యుద్ధం చెలరేగే అవకాశాలు కనిపించడం లేదని ఇరాన్‌ విప్లవ గార్డు దళాల ఉప రాజకీయ విభాగాధిపతి మహమ్మద్‌ అక్బర్‌జాదే పేర్కొన్నారు. అయితే అమెరికా ఎలాంటి దాడులకు పాల్పడినా వాటిని సమర్థంగా తిప్పికొడతామని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం తమ శత్రువులు బలహీన స్థితిలో ఉన్నారని కూడా వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా, ఇప్పటికీ ఇరాన్‌ను బలహీనపరచి విభజించాలని అమెరికా, ఇజ్రాయెల్‌ ప్రయత్నిస్తున్నాయని ఇరాన్‌ నిఘా మంత్రిత్వశాఖ ఆరోపించింది. లెబనాన్‌లో తీవ్ర ఘర్షణలు లెబనాన్‌లో ఇజ్రాయెల్‌ దళాలు, హెజ్‌బొల్లా యోధుల మధ్య మంగళవారం తీవ్ర స్థాయిలో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. లితానీ నది పరిసర ప్రాంతాల్లో ఇరు వర్గాలు పరస్పరం దాడులు జరిపాయి. ఈ ఘర్షణల్లో మొత్తం 12 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.

వివరాలు 

అణు నిల్వలపై ట్రంప్‌ వ్యాఖ్యలు

అలాగే హెజ్‌బొల్లాకు చెందిన వందకు పైగా స్థావరాలను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్‌ ప్రకటించింది. ఇరాన్‌కు చెందిన అణు నిల్వలను రష్యా లేదా చైనా తమ వద్దకు తీసుకెళ్తామని చెప్పినా అందుకు అంగీకరించే ప్రసక్తే లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పష్టం చేశారు. ఈ అంశంపై అమెరికా తన వైఖరిలో ఎలాంటి మార్పు లేదని ఆయన పేర్కొన్నారు.

Advertisement