Donald Trump: అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం పూర్తి.. హార్మూజ్ జలసంధి తిరిగి తెరుచుకోనుందా?
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం సంచలన ప్రకటన చేశారు. ఇరాన్‌తో శాంతి ఒప్పందం పూర్తయిందని, అలాగే హార్మూజ్ జలసంధి తిరిగి తెరుచుకోనుందని ఆయన తన 'ట్రూత్ సోషల్' వేదికపై వెల్లడించారు. అమెరికా నావికాదళం విధించిన ఆంక్షలు కూడా తక్షణమే ఎత్తివేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌తో ఒప్పందం పూర్తయింది. అందరికీ అభినందనలు. హార్మూజ్ జలసంధిని పూర్తిగా తెరవడానికి నేను అనుమతి ఇస్తున్నాను. అదే సమయంలో అమెరికా నావికాదళ బ్లాకేడ్‌ను కూడా తక్షణమే తొలగిస్తున్నాం. ప్రపంచ దేశాల నౌకలు స్వేచ్ఛగా ప్రయాణించండి. చమురు ప్రవాహం కొనసాగనివ్వండి అని ట్రంప్ తన పోస్టులో పేర్కొన్నారు.
వివరాలు
ఒప్పందానికి సంబంధించి అధికారికంగా విడుదల కాలేదు
ఈ ప్రకటనకు కొద్దిసేపటి ముందు, మధ్యవర్తిగా వ్యవహరించిన పాకిస్థాన్ ప్రభుత్వం కూడా అమెరికా-ఇరాన్ మధ్య ఒప్పందం కుదిరినట్లు ప్రకటించింది. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ 'ఎక్స్' వేదికగా స్పందిస్తూ, "ఇరుదేశాల మధ్య తీవ్ర చర్చల అనంతరం శాంతి ఒప్పందం పూర్తయింది. అన్ని యుద్ధ చర్యలు, లెబనాన్ సహా అన్ని రంగాల్లో తక్షణం, శాశ్వతంగా నిలిపివేయాలని రెండు పక్షాలు అంగీకరించాయని తెలిపారు. అయితే ఈ ఒప్పందంపై ఇరాన్ వైపు నుండి భిన్న స్పందన వెలువడింది. పాకిస్థాన్ చేసిన ప్రకటనపై ఇరాన్ అనుమానాలు వ్యక్తం చేయడంతో ఒప్పందం స్థిరత్వంపై ప్రశ్నలు నెలకొన్నాయి. ఇప్పటివరకు ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా విడుదల కాలేదు.
వివరాలు
గత ఫిబ్రవరి 28న హార్మూజ్ జలసంధిని మూసివేసిన ఇరాన్
ఈ ఒప్పందంపై సంతకాలు శుక్రవారం స్విట్జర్లాండ్‌లో జరిగే అవకాశం ఉందని షరీఫ్ తెలిపారు. అయితే హార్మూజ్ జలసంధి పూర్తిగా అన్ని నౌకలకు ఎప్పుడు తెరుచుకుంటుందన్న విషయంపై స్పష్టత ఇంకా రాలేదు. ప్రపంచంలో అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గాల్లో ఒకటైన హార్మూజ్ జలసంధి ద్వారా ప్రపంచ చమురు, సహజ వాయు సరఫరాలో దాదాపు ఐదో వంతు రవాణా జరుగుతుంది. గత ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైనప్పుడు ఇరాన్ ఈ కీలక మార్గాన్ని మూసివేసినట్లు సమాచారం. అనంతరం శాంతి చర్చలు విఫలమైన నేపథ్యంలో అమెరికా ఏప్రిల్‌లో ఇరాన్ పోర్టులపై నావికాదళ ఆంక్షలు విధించింది.