Iran War: ఇరాన్ పై అమెరికా సైన్యం మళ్ళీ భీకర దాడులు.. హర్మూజ్ జలసంధి మూసివేత
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు మరోసారి ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. తమ భూభాగంపై అమెరికా జరిపిన వైమానిక దాడులకు ప్రతిస్పందనగా వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ జలమార్గంలో ప్రయాణించే నౌకలను లక్ష్యంగా చేసుకుంటామని కూడా హెచ్చరించింది. ఈ పరిణామంతో గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ భయాలు మరింత పెరిగాయి. అంతేకాకుండా ప్రపంచ చమురు, ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలపై అంతర్జాతీయంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
వివరాలు
బహ్రెయిన్, జోర్డాన్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ ప్రతీకార దాడులు
హర్మూజ్ జలసంధి సమీపంలో అమెరికాకు చెందిన అపాచీ హెలికాప్టర్ కూల్చివేతతో ఈ ఘర్షణలకు తెరలేచింది. దీనికి ప్రతిగా అమెరికా సెంట్రల్ కమాండ్ ఇరాన్ దక్షిణ ప్రాంతాల్లోని సిరిక్,జాస్క్,క్వెష్మ్ ప్రాంతాల్లో ఉన్న గగనతల రక్షణ వ్యవస్థలు,రాడార్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు చేపట్టింది. ఇవి ఆత్మరక్షణ కోసమే చేపట్టిన పరిమిత చర్యలని అమెరికా వెల్లడించింది. అయితే ఈ దాడుల్లో టెలికాం టవర్లు, మంచినీటి ట్యాంకులు ధ్వంసమవడంతో సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇరాన్ మీడియా ఆరోపించింది. అమెరికా చర్యలకు ప్రతీకారంగా ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్(IRGC)రంగంలోకి దిగింది. బహ్రెయిన్‌లోని అమెరికా ఐదో నౌకాదళ ప్రధాన కార్యాలయం,జోర్డాన్‌లోని వైమానిక స్థావరం, కువైట్‌లోని కొన్ని కీలక ప్రాంతాలపై షాహెద్-136 డ్రోన్లు,క్షిపణులతో దాడులు జరిపినట్లు సమాచారం.
వివరాలు
కీలక అంశాలపై ఇరు దేశాల మధ్య విభేదాలు
ఇరాన్ ప్రయోగించిన ఐదు క్షిపణులను విజయవంతంగా అడ్డుకున్నామని, ఎలాంటి నష్టం సంభవించలేదని జోర్డాన్ ప్రకటించింది. మరోవైపు బహ్రెయిన్, కువైట్ దేశాల్లో అప్రమత్త చర్యల్లో భాగంగా సైరన్లు మోగించడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఈ సంక్షోభం ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త యుద్ధం ప్రారంభించాయి. ఆ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖొమేనీ మరణించారు. అనంతరం ఏప్రిల్ ప్రారంభంలో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ, ఇరాన్ అణు కార్యక్రమం, హిజ్బుల్లా కార్యకలాపాలు, హర్మూజ్ జలసంధిపై ఆధిపత్యం వంటి కీలక అంశాలపై ఇరు దేశాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి.
వివరాలు
భగ్గుమన్న చమురు ధరలు.. బ్యారెల్ 92 డాలర్లకు చేరిక
తాజా పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్‌కు 92 డాలర్లకు చేరుకుంది. గతంలో పాకిస్థాన్ వేదికగా జరిగిన దౌత్య చర్చల ద్వారా నెలకొన్న సానుకూల వాతావరణం తాజా హింసాత్మక పరిణామాలతో దెబ్బతినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరాన్ అణు కార్యక్రమంపై చర్చలకు, హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవడానికి తాము సిద్ధంగా ఉన్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంకేతాలు ఇస్తుండగా, తమపై ఎలాంటి దాడి జరిగినా అదే స్థాయిలో ప్రతిస్పందిస్తామని ఇరాన్ స్పష్టం చేసింది.