Trump: ట్రంప్ కీలక ప్రకటన.. ఇరాన్‌కు మరో 10 రోజుల గడువు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో శాంతి చర్చలు కొనసాగుతున్నప్పటికీ స్పష్టత మాత్రం కనిపించడం లేదు. ఈ పరిణామాల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులను మరో 10 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. టెహ్రాన్ ప్రభుత్వ అభ్యర్థన మేరకే ఈ నిర్ణయం తీసుకున్నానని ట్రూత్ సోషల్ వేదికగా వెల్లడించారు.
వివరాలు
హర్మూజ్ జలసంధి అంశంపై ఉద్రిక్తత
యుద్ధ పరిస్థితుల కారణంగా మూసివేసిన హర్మూజ్ జలసంధిని 48 గంటల్లోగా తిరిగి తెరవాలని ట్రంప్ ఇటీవల ఇరాన్‌కు గడువు విధించిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత తన వైఖరిలో మార్పు చూపిన ఆయన, ఇరాన్‌తో చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇరాన్ ఇంధన వనరులు, విద్యుత్ కేంద్రాలపై దాడులను మొదట ఐదు రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన ట్రంప్, ఇప్పుడు ఆ గడువును మరో 10 రోజులకు పొడిగించారు. దీంతో ఈ విరామం ఏప్రిల్ 6 వరకు కొనసాగనుంది.
వివరాలు
కాల్పుల విరమణకు దారితీస్తుందా?
ఇరాన్‌తో జరుగుతున్న చర్చలు సానుకూలంగా, వేగంగా ముందుకు సాగుతున్నాయని ట్రంప్ పేర్కొన్నారు. పురోగతి కనిపిస్తోందని కూడా ఆయన అన్నారు. ఈ అంశంపై మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలను నమ్మవద్దని స్పష్టం చేశారు. ఈ 10 రోజుల విరామం.. కాల్పుల విరమణకు దారితీస్తుందా లేక తాత్కాలిక ఉద్రిక్తతలను మాత్రమే తగ్గిస్తుందా అనేది అస్పష్టం ప్రస్తుతం ప్రపంచ దేశాలు ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాయి.