Loading...
Trump: ట్రంప్‌కు కోర్టులో ఎదురుదెబ్బ.. మీడియా సంస్థలపై బ్యాన్‌ ఎత్తివేతకు ఆదేశం
ట్రంప్‌కు కోర్టులో ఎదురుదెబ్బ.. మీడియా సంస్థలపై బ్యాన్‌ ఎత్తివేతకు ఆదేశం

Trump: ట్రంప్‌కు కోర్టులో ఎదురుదెబ్బ.. మీడియా సంస్థలపై బ్యాన్‌ ఎత్తివేతకు ఆదేశం

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 24, 2026
11:35 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సీఎన్‌ఎన్‌, ఎంఎస్‌ నౌ, పొలిటికోకు చెందిన జర్నలిస్టులను వైట్‌హౌస్‌లోకి అనుమతించకుండా ట్రంప్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఫెడరల్‌ కోర్టు అడ్డుకుంది. ఆయా సంస్థల రిపోర్టర్లకు వైట్‌హౌస్‌ యాక్సెస్‌ను వెంటనే పునరుద్ధరించాలని ఆదేశించింది. అంతేకాదు.. ఈ నిషేధం అమెరికా రాజ్యాంగంలోని హక్కులను ఉల్లంఘించే అవకాశం ఉందని న్యాయస్థానం అభిప్రాయపడింది.

వివరాలు 

మీడియా సంస్థలపై ట్రంప్‌ ఆగ్రహం

సెప్టెంబర్‌ 18న ట్రంప్‌ తన సోషల్‌ మీడియా వేదిక ద్వారా సీఎన్‌ఎన్‌, ఎంఎస్‌ నౌ, పొలిటికోపై తీవ్ర ఆరోపణలు చేశారు.

తన గురించి ఆయా సంస్థలు ''కల్పిత కథనాలు, అబద్ధాలు'' ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు.

ఈ నేపథ్యంలో ఆ సంస్థలకు చెందిన జర్నలిస్టులను వైట్‌హౌస్‌లోకి అనుమతించబోమని ప్రకటించారు.

అనంతరం ఆయా మీడియా సంస్థల రిపోర్టర్ల ప్రెస్‌ యాక్సెస్‌ను నిలిపివేశారు.

ఈ నిర్ణయంతో ట్రంప్‌ ప్రభుత్వం, అమెరికా మీడియా సంస్థల మధ్య వివాదం మరింత ముదిరింది.

వివరాలు 

'ట్రంప్‌ టీవీ' పేరుతో కొత్త స్ట్రీమింగ్‌ ఛానల్

ఇదే సమయంలో వైట్‌హౌస్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది.

ప్రధాన టీవీ నెట్‌వర్క్‌లు వైట్‌హౌస్‌ ప్రెసిడెన్షియల్‌ టీవీ పూల్‌ కవరేజీని నిలిపివేయడంతో.. వైట్‌హౌస్‌ స్వయంగా 'ట్రంప్‌ టీవీ' పేరుతో 24 గంటల స్ట్రీమింగ్‌ ఛానల్‌ను ప్రారంభించింది.

యూట్యూబ్‌, వైట్‌హౌస్‌ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఈ ఛానల్‌ ప్రసారమవుతోంది.

ట్రంప్‌ ప్రసంగాలు, గతంలో జరిగిన కార్యక్రమాల వీడియోలు, ఆయన ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలను ఇందులో ప్రసారం చేయడం ప్రారంభించారు.

ADVERTISEMENT

వివరాలు 

కోర్టును ఆశ్రయించిన మూడు మీడియా సంస్థలు

ట్రంప్‌ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ సీఎన్‌ఎన్‌, ఎంఎస్‌ నౌ, పొలిటికో సంయుక్తంగా కోర్టును ఆశ్రయించాయి.

తమపై విధించిన నిషేధం అమెరికా రాజ్యాంగంలోని ఫస్ట్‌ అమెండ్‌మెంట్‌ హక్కులను, మీడియా స్వేచ్ఛను ఉల్లంఘిస్తోందని వాదించాయి.

అంతేకాకుండా ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా, తమ వాదనను వినకుండా వైట్‌హౌస్‌ యాక్సెస్‌ను రద్దు చేసిందని మూడు సంస్థలు కోర్టుకు తెలిపాయి.

ADVERTISEMENT

వివరాలు 

'బ్యాన్‌'పై జడ్జి అభ్యంతరాలు

ఈ కేసును విచారించిన యూఎస్‌ డిస్ట్రిక్ట్‌ జడ్జి టిమ్‌ కెల్లీ.. వైట్‌హౌస్‌ అనుసరించిన విధానంపై పలు సందేహాలు వ్యక్తం చేశారు.

జర్నలిస్టుల యాక్సెస్‌ను రద్దు చేసే ముందు వారికి తగిన న్యాయ ప్రక్రియ కల్పించాలని, తమ వాదనను వినిపించే అవకాశం ఇవ్వాల్సి ఉంటుందని సూచించారు.

తాజాగా జారీ చేసిన ఆదేశాల్లో మూడు మీడియా సంస్థలకు చెందిన జర్నలిస్టుల వైట్‌హౌస్‌ యాక్సెస్‌ను పునరుద్ధరించాలని ఆదేశించారు.

ట్రంప్‌ విధించిన నిషేధం రాజ్యాంగ విరుద్ధమయ్యే అవకాశం ఉందని కూడా పేర్కొన్నారు.

వివరాలు 

'యాక్సెస్‌ హక్కు కాదు'.. ప్రభుత్వం వాదన

అయితే ట్రంప్‌ ప్రభుత్వం మాత్రం కోర్టులో భిన్నమైన వాదన చేసింది.

వైట్‌హౌస్‌లోకి మీడియా సంస్థలకు లభించే యాక్సెస్‌ అనేది రాజ్యాంగపరమైన హక్కు కాదని, అది ప్రభుత్వం కల్పించే ప్రత్యేక సదుపాయమని పేర్కొంది.

ఆయా మీడియా సంస్థల రిపోర్టింగ్‌ జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలను ప్రభావితం చేస్తోందని జస్టిస్‌ డిపార్ట్‌మెంట్‌ తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.

ట్రంప్‌ సైతం ఆయా సంస్థలు ప్రచురిస్తున్న వార్తలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

వివరాలు 

మీడియా స్వేచ్ఛపై ముదిరిన చర్చ

ట్రంప్‌ నిర్ణయంతో అమెరికాలో మీడియా స్వేచ్ఛ, అధ్యక్షుడి అధికారాలు, వైట్‌హౌస్‌ మీడియా యాక్సెస్‌పై విస్తృత చర్చ మొదలైంది.

మూడు సంస్థలపై విధించిన నిషేధానికి నిరసనగా ఇతర ప్రధాన టీవీ నెట్‌వర్క్‌లు కూడా వైట్‌హౌస్‌ ప్రెస్‌ పూల్‌ కవరేజీని తాత్కాలికంగా నిలిపివేశాయి.

దీంతో అధ్యక్షుడి అధికారిక కార్యక్రమాలకు సంబంధించిన మీడియా కవరేజీపై ప్రభావం పడింది.

తాజా ఫెడరల్‌ కోర్టు ఆదేశంతో ట్రంప్‌-మీడియా వివాదం మరో కీలక మలుపు తిరిగింది.

ఇక ఈ కేసులో తదుపరి న్యాయపరమైన పరిణామాలు వైట్‌హౌస్‌ మీడియా యాక్సెస్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది.

ఫెడరల్‌ కోర్టు ఆదేశాన్ని ట్రంప్‌ ప్రభుత్వం పైకోర్టులో సవాల్‌ చేసే అవకాశం కూడా ఉంది.

ADVERTISEMENT