
Badar Khan Suri: హమాస్‌తో సంబంధాల ఆరోపణలతో అరెస్టయిన భారతీయ విద్యార్థి.. బహిష్కరణను నిలిపేసిన అమెరికా న్యాయస్థానం
ఈ వార్తాకథనం ఏంటి
హమాస్ భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో భారత విద్యార్థి బదర్ ఖాన్ సురి అమెరికాలో అరెస్టయిన విషయం తెలిసిందే.
అతడిని దేశం నుండి బహిష్కరించేందుకు అమెరికా చేసిన ప్రయత్నాలను యూఎస్ కోర్టు నిలువరించింది.
తదుపరి ఉత్తర్వులు వచ్చేంతవరకు అతడి బహిష్కరణను నిలిపివేయాలని వర్జీనియా కోర్టు తీర్పునిచ్చింది.
అరెస్టు వివరాలు
వాషింగ్టన్ డీసీలోని జార్జ్‌టౌన్ యూనివర్సిటీలో పోస్ట్-డాక్టోరల్ విద్యార్థిగా ఉన్న బదర్ ఖాన్ సురి హమాస్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నాడని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) ఆరోపించింది.
అతడికి హమాస్‌లోని పలువురితో సంబంధాలు ఉన్నట్లు పేర్కొంది. దీంతో అతడి వీసాను రద్దు చేసి, గత సోమవారం వర్జీనియాలోని నివాసం నుండి అదుపులోకి తీసుకున్నారు.
వివరాలు
కోర్టులో సవాల్
తన అరెస్టును సవాల్ చేస్తూ సురి కోర్టును ఆశ్రయించాడు.ఇది పూర్తిగా రాజకీయకుట్ర అని తన పిటిషన్‌లో ఆరోపించాడు.
విచారణ జరిపిన ఈస్ట్రన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ వర్జీనియా కోర్టు అతడికి తాత్కాలిక ఉపశమనం కల్పించింది.
తదుపరి ఉత్తర్వులు వచ్చేంతవరకు అమెరికా నుంచి బహిష్కరించకూడదని స్పష్టం చేసింది.
ప్రస్తుతం సురిని లూసియానాలోని ఇమిగ్రేషన్ డిటెన్షన్ సెంటర్‌లో ఉంచినట్లు అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ వెల్లడించింది.
సురి కుటుంబ నేపథ్యం
భారతీయుడైన బదర్ ఖాన్ సురి విద్యార్థి వీసాపై అమెరికా వెళ్లాడు.అతడు జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో పీహెచ్‌డీ పూర్తి చేసి,పోస్ట్-డాక్టోరల్ కోసం అమెరికా విశ్వవిద్యాలయంలో చేరాడు.
అతడి భార్య మాఫెజ్ సలేహ్,పాలస్తీనా మూలాలున్న అమెరికా పౌరురాలు.ఆమె తండ్రి గతంలో గాజా ప్రభుత్వంలో పనిచేసినట్లు తెలుస్తోంది.
వివరాలు
స్వీయ బహిష్కరణకు సీబీపీ హోమ్ యాప్..
అమెరికాలో చట్టవ్యతిరేకంగా నివసిస్తున్న వారు స్వీయ బహిష్కరణ చేసుకునేందుకు CBP హోమ్ యాప్ రూపొందించారు.
దీనిపై ట్రంప్ స్పందిస్తూ, అక్రమ వలసదారులు ఆ యాప్‌ను ఉపయోగించి దేశాన్ని వీడాలని సూచించారు.
లేకపోతే, బలవంతంగా పంపిస్తామని, భవిష్యత్తులో అమెరికాలో అడుగుపెట్టకుండా చేస్తామని హెచ్చరించారు.
స్వచ్ఛందంగా వెళ్లినవారికి చట్టబద్ధంగా తిరిగి ప్రవేశించే అవకాశం ఉంటుందని తెలిపారు.
ఇలాంటి మరో ఘటన
భారత విద్యార్థి రంజనీ శ్రీనివాసన్ ఈ యాప్‌ను ఉపయోగించి అమెరికా వీడిన సంగతి తెలిసిందే.
ఇటీవల కొలంబియా యూనివర్సిటీలో పాలస్తీనాకు మద్దతుగా నిరసనలు జరిగాయి.
వీటికి మద్దతుగా రంజనీ వ్యవహరించడంతో ఆమె వీసా రద్దు అయ్యింది. దాంతో ఆమె స్వచ్ఛందంగా అమెరికా విడిచి వెళ్లింది.