US: అపాచీ హెలికాప్టర్ కూల్చివేతకు ప్రతీకారం.. ఇరాన్‌పై అమెరికా భారీ వైమానిక దాడులు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా ఆర్మీకి చెందిన అపాచీ హెలికాప్టర్‌ను కూల్చివేసినందుకు ప్రతీకారంగా అమెరికా బలగాలు ఇరాన్‌పై వైమానిక దాడులు ప్రారంభించాయి ఈ ఆపరేషన్ అత్యంత శక్తివంతంగా కొనసాగుతోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించగా,యూఎస్ సెంట్రల్ కమాండ్(సెంట్‌కామ్)కూడా దాడులను అధికారికంగా ధ్రువీకరించింది. ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి ఈ దాడులు ప్రారంభమైనట్లు సెంట్‌కామ్ తన ఎక్స్ వేదికగా వెల్లడించింది. దాడుల అనంతరం దక్షిణ ఇరాన్‌లోని బందర్ అబ్బాస్, క్వెష్మ్ ద్వీపం,సిరిక్,జాస్క్ కౌంటీ ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. అప్రమత్తమైన ఇరాన్ వాయు రక్షణ వ్యవస్థలు వెంటనే రంగంలోకి దిగగా,అమెరికాకు చెందిన యుద్ధ విమానాలు ఈ ప్రాంతాల్లో లక్ష్యాలపై దాడులు జరిపినట్లు సమాచారం.
వివరాలు
ఇరాన్‌పై అతిపెద్ద దాడికి సిద్ధమంటూ ఇజ్రాయెల్ హెచ్చరిక
ఈ పరిణామాలకు ముందు హర్మూజ్ జలసంధి సమీపంలో అమెరికా అపాచీ హెలికాప్టర్‌ను ఇరాన్ కూల్చివేసిందని ట్రంప్ ఆరోపించారు. అయితే హెలికాప్టర్ ధ్వంసమైనప్పటికీ, అందులో ఉన్న ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారని తెలిపారు. ఈ ఘటనను అమెరికా తేలికగా తీసుకోదని, తగిన రీతిలో ప్రతిస్పందిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య వరుస దాడులు, ప్రతిదాడులతో మధ్యప్రాచ్య ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే సమయంలో భవిష్యత్తులో ఇరాన్‌పై మరింత తీవ్రమైన, శక్తివంతమైన సైనిక చర్యలకు సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయెల్ ఆర్మీ కమాండర్ ఇయాల్ జమీర్ హెచ్చరించారు. మరోవైపు, ఇజ్రాయెల్ దక్షిణ లెబనాన్‌పై కూడా దాడులను మళ్లీ ప్రారంభించడంతో మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం మరింత వేడెక్కుతోంది.