US-Iran War: ఇరాన్‌పై అమెరికా మరోసారి ప్రతీకార దాడులు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. ఆదివారం అమెరికా మరోసారి ఇరాన్‌పై వైమానిక దాడులు నిర్వహించింది. జోర్డాన్‌లో జరిగిన దాడిలో ఇద్దరు అమెరికా సైనికులు మరణించిన ఘటనకు ప్రతిస్పందనగానే ఈ ఆపరేషన్ చేపట్టినట్లు అమెరికా వెల్లడించింది. అమెరికా సెంట్రల్ కమాండ్(CENTCOM)ప్రకారం, ఇది వరుసగా ఎనిమిదో రాత్రి నిర్వహించిన దాడి. జోర్డాన్‌లో అమెరికా సైనికులను లక్ష్యంగా చేసుకున్న ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్(IRGC) సామర్థ్యాన్ని దెబ్బతీయడమే ఈ ఆపరేషన్ ప్రధాన ఉద్దేశమని పేర్కొంది. ఈ దాడులు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు జరిగాయని సెంట్‌కామ్ వెల్లడించింది. అలాగే హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలకు ముప్పు కలిగించే ఇరాన్ సామర్థ్యాన్ని మరింత బలహీనపరచడమే ఈ సైనిక చర్యల మరో ముఖ్య లక్ష్యమని తెలిపింది.
వివరాలు
ప్రతీకారంగా అమెరికా స్థావరాలపై ఇరాన్ డ్రోన్ దాడులు
అమెరికా దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ కువైట్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై డ్రోన్ దాడులు నిర్వహించినట్లు ప్రకటించింది.
ఇరాన్ సైన్యం విడుదల చేసిన వివరాల ప్రకారం కువైట్‌లోని క్యాంప్ ఉదైరి (Camp Udairi)లో ఉన్న మందుగుండు సామగ్రి నిల్వ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుంది.
అలాగే అలీ అల్ సలేం ఎయిర్ బేస్ (Ali Al Salem Air Base)లో ఉన్న పేట్రియట్ రాడార్ వ్యవస్థతో పాటు వైమానిక నిఘా రాడార్‌ను ధ్వంసం చేసినట్లు వెల్లడించింది.
ఈ ఆపరేషన్ పూర్తిగా అమెరికా జరిపిన తాజా వైమానిక దాడులకు ప్రతీకార చర్యగానే చేపట్టినట్లు ఇరాన్ సైన్యం స్పష్టం చేసింది.
అమెరికా, ఇరాన్ మధ్య పరస్పర దాడులు కొనసాగుతుండటంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమవుతున్నాయి.