USA-Iran: ఇరాన్ నౌకలకు గ్రీన్ సిగ్నల్.. హర్మూజ్‌లో అమెరికా దిగ్బంధనం ఎత్తివేత
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం అనంతరం హర్మూజ్ జలసంధిలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇరాన్‌కు చెందిన నౌకలు, ఆ దేశ ఓడరేవులకు వెళ్లే వాణిజ్య నౌకలపై అమల్లో ఉన్న దిగ్బంధనాన్ని అమెరికా ఎత్తివేసింది. ఈ విషయాన్ని అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్‌కామ్) అధికారికంగా ప్రకటించింది. సెంట్‌కామ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు ఇరాన్ ఓడరేవులు, తీర ప్రాంతాలకు రాకపోకలు సాగించే అన్ని నౌకలపై అమలులో ఉన్న ఆంక్షలను తొలగించారు. ఇకపై ఇరాన్ నౌకాశ్రయాలకు వెళ్లే లేదా అక్కడి నుంచి వచ్చే నౌకల ప్రయాణానికి అమెరికా బలగాలు ఎలాంటి ఆటంకం కలిగించబోవని స్పష్టం చేసింది.
వివరాలు
అమెరికా-ఇరాన్ మధ్య 60 రోజుల శాంతి ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు
అయితే దిగ్బంధనం ఎత్తివేసినప్పటికీ, ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం అమలును పర్యవేక్షించేందుకు అమెరికా యుద్ధనౌకలు హర్మూజ్ జలసంధి పరిసర ప్రాంతాల్లోనే మోహరించి ఉంటాయని సెంట్‌కామ్ వెల్లడించింది. ఒప్పందంలోని అన్ని నిబంధనలు పూర్తిగా అమలవుతున్నాయని నిర్ధారించుకునే వరకు తమ శక్తిమంతమైన నౌకాదళం అప్రమత్తంగా విధులు నిర్వహిస్తుందని పేర్కొంది. ఇటీవల అమెరికా-ఇరాన్ మధ్య 60 రోజుల శాంతి ఒప్పందానికి సంబంధించిన అవగాహన పత్రం (ఎంవోయూ)పై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం అమల్లోకి రావడంతో హర్మూజ్ జలసంధిలో చిక్కుకుపోయిన నౌకలు మళ్లీ తమ ప్రయాణాన్ని ప్రారంభించాయి. దీంతో ప్రపంచ చమురు సరఫరాపై నెలకొన్న అనిశ్చితి తగ్గే అవకాశం కనిపిస్తోంది.
వివరాలు
డీల్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: ఇరాన్
మరికొన్ని రోజుల్లో చమురు రవాణా పూర్తిస్థాయిలో సాధారణ స్థితికి చేరుకుంటుందని అంతర్జాతీయ వాణిజ్య వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు అమెరికాకు ఇరాన్ గట్టి హెచ్చరికలు జారీ చేసింది.శాంతి ఒప్పందానికి సంబంధించిన చర్చలు,అమలు ప్రక్రియలో అమెరికా లేదా దాని మిత్రదేశాలు దురుద్దేశంతో వ్యవహరించినా, ఒప్పందాన్ని ఉల్లంఘించినా లేదా మితిమీరిన డిమాండ్లు చేసినా తమ ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ఘాలిబఫ్ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌లో పోస్టు చేశారు. గత ఘర్షణల్లో ప్రత్యర్థులు ఇప్పటికే తీవ్ర నష్టాలను చవిచూశారని,మళ్లీ అదే విధానాన్ని అనుసరిస్తే పరిస్థితులు మరింత దారుణంగా మారతాయని ఆయన స్పష్టం చేశారు. శాంతి ఒప్పందం అమలులో పరస్పర గౌరవం, నిబంధనల పాటింపు అత్యంత కీలకమని పేర్కొన్నారు.