America: ఇరాన్ యుద్ధంలో అమెరికాకు భారీ దెబ్బ.. 42 విమానాలు ధ్వంసమైనట్లు నివేదిక
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్‌తో ఇటీవల జరిగిన యుద్ధంలో అమెరికాకు భారీ స్థాయిలో నష్టం వాటిల్లినట్లు అమెరికా కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ వెల్లడించింది. "ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ"పేరుతో చేపట్టిన ఈ సైనిక చర్యలో మొత్తం 42అమెరికా విమానాలు ధ్వంసం కావడం లేదా తీవ్రంగా దెబ్బతినడం జరిగిందని తన తాజా నివేదికలో పేర్కొంది. ఈ వివరాలు బయటకు రావడంతో అమెరికా రాజకీయ,రక్షణ వర్గాల్లో తీవ్ర చర్చ మొదలైంది. సీఆర్ఎస్ వెల్లడించిన వివరాల ప్రకారం.. నష్టపోయిన వాటిలో అత్యాధునిక యుద్ధ విమానాలు,నిఘా డ్రోన్లు కూడా ఉన్నాయి. నాలుగు ఎఫ్-15ఈ యుద్ధ విమానాలు,ఒక ఎఫ్-35ఏ యుద్ధ విమానం,ఏడు కేసీ-135 ఇంధన సరఫరా విమానాలు దెబ్బతిన్నట్లు తెలిపింది. వీటితో పాటు 24 ఎంక్యూ-9 రీపర్ డ్రోన్లు కూడా నాశనమైనట్లు నివేదిక స్పష్టం చేసింది.
వివరాలు
యుద్ధం ఖర్చు 29 బిలియన్ డాలర్లకు చేరినట్లు ప్రకటన
అలాగే ఏ-10 థండర్‌బోల్ట్, ఈ-3 సెంట్రీ అవాక్స్ వంటి కీలక యుద్ధ విమానాలు కూడా ఈ జాబితాలో ఉన్నట్లు పేర్కొంది. ఈ యుద్ధం వల్ల అమెరికా ఖజానాపై కూడా భారీ భారం పడినట్లు సమాచారం. ఈ సైనిక చర్య కోసం అయ్యే మొత్తం వ్యయం సుమారు 29 బిలియన్ డాలర్ల వరకు చేరే అవకాశముందని పెంటగాన్ తాత్కాలిక లెక్కల అధికారి జూల్స్ డబ్ల్యూ హర్ట్స్ అమెరికా పార్లమెంటరీ కమిటీకి వివరించారు. దెబ్బతిన్న యుద్ధ పరికరాల మరమ్మతులు, కొత్త విమానాల కొనుగోలు అంచనాలు పెరగడంతో ఖర్చు భారీగా పెరిగినట్లు తెలిపారు.
వివరాలు
అమెరికా కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ నివేదికలో వివరాలు
అమెరికా కాంగ్రెస్‌కు విధానపరమైన విశ్లేషణలు అందించే సీఆర్ఎస్.. రక్షణ శాఖ, సెంట్రల్ కమాండ్ విడుదల చేసిన అధికారిక ప్రకటనలు, పలు వార్తా నివేదికల ఆధారంగా ఈ సమాచారాన్ని సిద్ధం చేసింది. ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని బలహీనపరచడమే లక్ష్యంగా అమెరికా ఈ ఏడాది ఫిబ్రవరి 28న "ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ"ను ప్రారంభించిన విషయం తెలిసిందే.