US Navy: దక్షిణ చైనా సముద్రంలో కూలిన అమెరికా నేవీ హెలికాప్టర్, ఫైటర్ జెట్
ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణ చైనా సముద్రంలో అమెరికా నౌకాదళానికి చెందిన రెండు ఆధునిక యుద్ధ వాహనాలు కేవలం అరగంట వ్యవధిలోనే దుర్ఘటనకు గురయ్యాయి. యూఎస్ పసిఫిక్ ఫ్లీట్ పరిధిలో ఉన్న'యూఎస్ఎస్ నిమిట్జ్'అనే విమాన వాహక నౌక నుంచి బయలుదేరిన ఒక ఫైటర్ జెట్,ఒక హెలికాప్టర్ వరుసగా సముద్రంలో కూలిపోయాయి. అదృష్టవశాత్తూ,ఈ రెండు ప్రమాదాల నుంచి సిబ్బంది సురక్షితంగా బయటపడడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే, రొటీన్ ఆపరేషన్లలో భాగంగా 'యూఎస్ఎస్ నిమిట్జ్' నుంచి గాల్లోకి ఎగిరిన ఎంహెచ్-60ఆర్ 'సీహాక్'హెలికాప్టర్ కొద్ది సేపటికే సాంకేతిక లోపం కారణంగా సముద్రంలో కూలిపోయింది. ఈ ఘటన జరిగిన ముప్పై నిమిషాల వ్యవధిలోనే అదే నౌక నుంచి టేకాఫ్ చేసిన బోయింగ్ ఎఫ్/ఏ-18ఎఫ్'సూపర్ హార్నెట్'యుద్ధ విమానం కూడా సముద్రంలో పడిపోయింది.
వివరాలు
సాంకేతిక లోపాలే కారణమని ప్రాథమిక అంచనా
ప్రమాద వార్త అందిన వెంటనే రక్షణ బృందాలు అప్రమత్తమై సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించాయి. హెలికాప్టర్‌లో ఉన్న ముగ్గురు సిబ్బందిని, ఫైటర్ జెట్‌లోని ఇద్దరు పైలట్లను సురక్షితంగా బయటకు తీసినట్లు అమెరికా నేవీ అధికారులు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం,ఇవి సాధారణ కార్యకలాపాల సమయంలో ఏర్పడిన సాంకేతిక లోపాల వల్ల జరిగి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ రెండు సంఘటనలపై పసిఫిక్ ఫ్లీట్ కమాండ్ ఇప్పటికే దర్యాప్తు ఆదేశించింది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో ఈ ఘటనలు చోటుచేసుకోవడం వ్యూహాత్మకంగా ప్రాధాన్యం సంతరించుకుంది. సిబ్బంది క్షేమంగా బయటపడ్డప్పటికీ, రెండు శక్తివంతమైన యుద్ధ విమానాలను కోల్పోవడం అమెరికా నౌకాదళానికి గణనీయమైన దెబ్బగా విశ్లేషకులు పేర్కొంటున్నారు.