Loading...
Trump-U.S. television: ట్రంప్‌పై అమెరికా మీడియా తిరుగుబాటు.. వెంటనే 24 గంటల 'ట్రంప్‌ టీవీ'ని తెచ్చిన వైట్‌హౌస్
'ట్రంప్‌ టీవీ'ని తెచ్చిన వైట్‌హౌస్

Trump-U.S. television: ట్రంప్‌పై అమెరికా మీడియా తిరుగుబాటు.. వెంటనే 24 గంటల 'ట్రంప్‌ టీవీ'ని తెచ్చిన వైట్‌హౌస్

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 22, 2026
08:41 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌-మీడియా సంస్థల మధ్య వివాదం మరో దశకు చేరుకుంది. సీఎన్‌ఎన్‌, ఎంఎస్‌ నౌ, పొలిటికో సంస్థలను వైట్‌హౌస్‌ కవరేజీ నుంచి నిషేధించడాన్ని నిరసిస్తూ అమెరికాలోని ప్రధాన టీవీ నెట్‌వర్క్‌లు అధ్యక్షుడి కార్యక్రమాల 'పూల్‌ కవరేజీ'ని నిలిపివేశాయి. ఈ పరిణామాల నేపథ్యంలో వైట్‌హౌస్‌ సొంతంగా 'ట్రంప్‌ టీవీ' పేరుతో 24 గంటల స్ట్రీమింగ్‌ వేదికను అందుబాటులోకి తీసుకొచ్చింది.

వివరాలు 

మీడియా సంస్థలపై ట్రంప్‌ నిషేధం

సీఎన్‌ఎన్‌, ఎంఎస్‌ నౌ, పొలిటికో సంస్థలు తన పాలనపై చేస్తున్న రిపోర్టింగ్‌ను ట్రంప్‌ తీవ్రంగా తప్పుబట్టారు.

'ఫేక్‌ న్యూస్‌' పేరుతో ఈ మూడు సంస్థలను వైట్‌హౌస్‌ నుంచి నిషేధిస్తున్నట్లు సెప్టెంబర్‌ 18న ప్రకటించారు.

అనంతరం ఆయా సంస్థలకు చెందిన జర్నలిస్టులను వైట్‌హౌస్‌ ప్రవేశం వద్దే అడ్డుకున్నారు.

ఈ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ మూడు సంస్థలు ఫెడరల్‌ కోర్టును ఆశ్రయించాయి.

తమ వార్తలను ప్రభుత్వం ఇష్టపడటం లేదనే కారణంతో మీడియా కవరేజీని అడ్డుకోవడం సరికాదని ఆయా సంస్థలు వాదించాయి.

ఈ నిషేధం అమెరికా రాజ్యాంగంలోని మొదటి సవరణలోని పత్రికా స్వేచ్ఛ హక్కులను ఉల్లంఘిస్తోందని కోర్టులో పేర్కొన్నాయి.

ఐదో సవరణలోని న్యాయపరమైన ప్రక్రియకు సంబంధించిన హక్కులు కూడా ప్రభావితమవుతున్నాయని తెలిపాయి.

వివరాలు 

టీవీ నెట్‌వర్క్‌ల అసాధారణ నిరసన

ట్రంప్‌ నిర్ణయానికి నిరసనగా సీఎన్‌ఎన్‌కు ఇతర ప్రధాన టీవీ నెట్‌వర్క్‌లు సంఘీభావం ప్రకటించాయి.

సాధారణంగా అధ్యక్షుడి కార్యక్రమాలను కవర్‌ చేసే టీవీ పూల్‌లో ఏబీసీ, సీబీఎస్‌, సీఎన్‌ఎన్‌, ఫాక్స్‌ న్యూస్‌, ఎన్‌బీసీ సంస్థలు రొటేషన్‌ పద్ధతిలో పాల్గొంటాయి.

అయితే సీఎన్‌ఎన్‌కు కేటాయించిన బాధ్యతను వైట్‌హౌస్‌ అడ్డుకోవడంతో మిగిలిన నాలుగు సంస్థలు కూడా ప్రత్యామ్నాయంగా తమ సిబ్బందిని పంపేందుకు నిరాకరించాయి.

దీంతో అధ్యక్షుడి పూల్‌ కవరేజీని తాత్కాలికంగా నిలిపివేశారు.

ADVERTISEMENT

వివరాలు 

పూల్‌ టీవీ కవరేజ్‌ అంటే ఏమిటి?

వైట్‌హౌస్‌లో జరిగే ముఖ్యమైన కార్యక్రమాలకు వందలాది మీడియా సంస్థల కెమెరాలను ఒకేసారి అనుమతించడం సాధ్యం కాదు.

స్థలాభావం, భద్రతా కారణాల వల్ల కొన్ని ఎంపిక చేసిన టీవీ నెట్‌వర్క్‌లు రొటేషన్‌ పద్ధతిలో కార్యక్రమాలను కవర్‌ చేస్తాయి.

అక్కడి నుంచి తీసిన వీడియోను ఇతర మీడియా సంస్థలకు కూడా అందిస్తారు. ఈ వ్యవస్థనే 'పూల్‌ టీవీ కవరేజ్‌'గా పిలుస్తారు.

అధ్యక్షుడి రోజువారీ కార్యక్రమాలు, పర్యటనలు, ముఖ్యమైన సమావేశాల ప్రసారంలో ఈ విధానం కీలకంగా ఉంటుంది.

ADVERTISEMENT

వివరాలు 

ట్రంప్‌ హెలిప్యాడ్‌ ప్రారంభోత్సవంలో వినిపించని ప్రసంగం

ఈ మీడియా బహిష్కరణ ప్రభావం వెంటనే కనిపించింది.

సోమవారం వైట్‌హౌస్‌ సౌత్‌ లాన్‌లో కొత్త హెలిప్యాడ్‌ను ట్రంప్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని కవర్‌ చేయాల్సిన బాధ్యత సీఎన్‌ఎన్‌కు ఉంది.

అయితే మీడియా పూల్‌ కవరేజీ నిలిచిపోవడంతో ఇతర నెట్‌వర్క్‌లు కూడా అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం చేయలేదు.

వైట్‌హౌస్‌ సొంత ఫీడ్‌లో కార్యక్రమం ప్రసారమైనప్పటికీ ట్రంప్‌ మాట్లాడిన మాటలు స్పష్టంగా వినిపించలేదు.

ఆయన వెనుక ఉన్న హెలికాప్టర్‌ శబ్దం కారణంగా ప్రసంగం ఆడియో దాదాపు వినిపించకుండా పోయింది.

సాధారణంగా టీవీ పూల్‌ సిబ్బంది ప్రత్యేక మైక్రోఫోన్లతో అధ్యక్షుడి ప్రసంగాన్ని స్పష్టంగా రికార్డు చేస్తారు.

ఈసారి ఆ ఏర్పాట్లు లేకపోవడంతో పరిస్థితి భిన్నంగా మారింది.

వివరాలు 

బాయ్‌కాట్‌కు ట్రంప్‌ 'ట్రంప్‌ టీవీ'తో కౌంటర్

ఇదే సమయంలో న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా ట్రంప్‌ పలువురు విదేశీ నేతలతో భేటీ కానున్నారు.

ఆ కార్యక్రమాల టెలివిజన్‌ కవరేజీపై కూడా పూల్‌ బహిష్కరణ ప్రభావం పడింది.

మీడియా సంస్థలు పూల్‌ కవరేజీని నిలిపివేయడంతో వైట్‌హౌస్‌ సొంత ప్రసార వ్యవస్థను తెరపైకి తీసుకొచ్చింది.

'TRUMP TV: The Essentials Station' పేరుతో 24 గంటల స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది.

ఇందులో ట్రంప్‌ పాలనకు సంబంధించిన ప్రకటనలు, వీడియోలు, గత కార్యక్రమాల దృశ్యాలు తదితరాలను ప్రసారం చేస్తున్నారు.

వైట్‌హౌస్‌ అధికారిక సోషల్‌ మీడియా ఖాతాలు, యూట్యూబ్‌ వేదికల ద్వారా దీనిని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సమాచారం.

మీడియా సంస్థల నిషేధంపై ట్రంప్‌ తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు.

వివరాలు 

ట్రూత్‌ సోషల్‌ తరహాలోనే టీవీ వేదిక

మీడియా సంస్థలు నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉందని, తన అభిప్రాయం ప్రకారం తప్పుడు వార్తలు ప్రచురించే సంస్థలకు వైట్‌హౌస్‌ ప్రవేశం కల్పించాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు.

అయితే ఈ నిర్ణయంపై మీడియా సంస్థలు, పత్రికా స్వేచ్ఛకు సంబంధించిన సంస్థలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

మీడియాతో ట్రంప్‌కు వివాదం కొత్తది కాదు. గతంలో సోషల్‌ మీడియా వేదికలతో ఆయనకు విభేదాలు తలెత్తిన సమయంలో తన సొంత వేదికగా 'ట్రూత్‌ సోషల్‌'ను ఉపయోగించారు.

ఇప్పుడు ప్రధాన టీవీ నెట్‌వర్క్‌లతో వివాదం ముదరడంతో వైట్‌హౌస్‌ ఆధ్వర్యంలో సొంత స్ట్రీమింగ్‌ వేదికను తీసుకురావడం మరో కీలక పరిణామంగా మారింది.

దీంతో అధ్యక్షుడి కార్యక్రమాలను సంప్రదాయ టీవీ నెట్‌వర్క్‌లపై ఆధారపడకుండా నేరుగా ప్రజలకు చేరవేసే ప్రయత్నం మొదలైంది.

ADVERTISEMENT