
Tariff Tussle: భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలు..సవాళ్లు ఉన్నా కలిసి ఇరు దేశాలు కలిసి పని చేస్తాయని ఆశిస్తున్నా: స్కాట్ బెసెంట్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా విధించిన 50 శాతం సుంకాలు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, భారత్ వ్యాపార వర్గాల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామంపై అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఎంత క్లిష్టంగా ఉన్నా, చివరకు అవి సహకార దిశగా సాగుతాయనే నమ్మకం వ్యక్తం చేశారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన, ప్రస్తుతం భారత్-అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందం (Trade Deal) ఇంకా తుది నిర్ణయానికి రాలేదని తెలిపారు. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని,అమెరికా అత్యంత శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని గుర్తుచేసిన బెసెంట్,చివరికి ఇరుదేశాలు కలిసి పనిచేస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు.
వివరాలు
రష్యా నుంచి చమురు కొనుగోలుతో భారత్ లాభాలు
ట్రంప్, ప్రధాని మోదీ మధ్య ఉన్నత స్థాయి సంబంధాలు ఉన్నాయని, ఈ సమస్య కేవలం ఇది రష్యా చమురుకు సంబంధించినది కాదన్నారు. సుంకాల అంశంపై భారత్ ముందుగానే చర్చలు ప్రారంభించినా, ఒప్పందం మాత్రం పూర్తి కాలేదని మంత్రి తెలిపారు. మే లేదా జూన్‌లో ఇది పూర్తవుతుందనే అంచనాలు పెట్టుకున్నా, అనుకున్నట్లుగా ముందుకు సాగలేదని చెప్పారు. రష్యా నుంచి చమురు దిగుమతులు చేసుకోవడం ద్వారా భారత్ ఆర్థికంగా లాభాలు పొందుతోందని, ఈ అంశంపై భారత్ తన స్వతంత్ర వైఖరి అవలంబించిందని కూడా ఆయన పేర్కొన్నారు.
వివరాలు
డాలరుతో పోలిస్తే రూపాయి విలువ కనిష్ఠ స్థాయికి
ఇక భారత్-అమెరికాల మధ్య వాణిజ్య లోటు (Trade Deficit) భారీ స్థాయిలో ఉందని బెసెంట్ గుర్తుచేశారు. అదేవిధంగా, భారత రూపాయి విలువ డాలరుతో పోలిస్తే కనిష్ఠ స్థాయికి పడిపోయిందని ఆయన అన్నారు. వాణిజ్య రంగం నుంచి పెరుగుతున్న ఆందోళనల నడుమ అమెరికా ఆర్థిక మంత్రి నుంచి వచ్చిన ఈ వ్యాఖ్యలు విశేష ప్రాధాన్యం సంతరించుకున్నాయి.