China roller spoiler: జీ20 సమ్మిట్‌లో చైనా పాత్రపై అమెరికా ఉన్నతాధికారి కీలక వ్యాఖ్యలు
దిల్లీలో జరగనున్న జీ20 సమ్మిట్‌లో చైనా పాత్రపై అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జీ20 సదస్సులో చైనా ఎలాంటి పాత్ర పోషిస్తుందో నిర్ణయించుకోవాల్సిన బాధ్యత ఆ దేశంపై ఉందని స్పష్టం చేశారు. అంతేకాకుండా 'స్పాయిలర్(చెడగొట్టడం)' పోషించే అవకాశం కూడా చైనాకు ఉందని ఆయన పేర్కొన్నారు. జీ20 సదస్సుపై భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతల ప్రభావం ఉంటుందా? అని విలేకరులు అడిగినప్పుడు జేక్ సుల్లివన్ పై విధంగా స్పందించారు. జీ20 సమ్మిట్ 2023కు అధ్యక్షత వహిస్తున్న భారత్ మాత్రం చైనాతో పాటు అన్ని దేశాలు సమావేశాల్లో భాగం కావాలని కోరుకుంటోందని ఆయన స్పష్టం చేశారు.
భౌగోళిక రాజకీయ సమస్యలను పక్కనబెట్టాలి: సుల్లివన్
ఇక భారతదేశం విషయానికి వస్తే, జీ20 ప్రెసిడెన్సీగా వాతావరణం, బహుపాక్షిక అభివృద్ధి, బ్యాంకు సంస్కరణలు, రుణ ఉపశమనాలు, సాంకేతికతపై నిర్మాణాత్మక మార్గాలపై దృష్టి పెడుతుందని తాను నమ్ముతున్నట్లు సుల్లివన్ చెప్పారు. భౌగోళిక రాజకీయ ప్రశ్నలను పక్కనబెట్టి, సమస్య పరిష్కారంపై భారత్ ఫోకస్ పెడుతుందని ఆయన విశ్వసించారు. అమెరికాతో పాటు ఇతర సభ్యదేశాలు ఇలాగే చేస్తాయని సుల్లివన్ పేర్కొన్నారు. చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ జీ20 శిఖరాగ్ర సమావేశానికి గైర్హాజరు అవుతున్న విషయం తెలిసిందే. దీంతో చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి బృందానికి ప్రీమియర్ లీ కియాంగ్ నాయకత్వం వహించనున్నారు. దిల్లీలో సెప్టెంబరు 9, 10 తేదీల్లో జీ20 సమ్మిట్ జరగనుంది.