
Russia-Ukraine: క్రిమియాపై రష్యా నియంత్రణ కొనసాగడానికి సానుకూలం.. శాంతి ఒప్పందంపై యూఎస్
ఈ వార్తాకథనం ఏంటి
రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికే అవకాశంగా ఒక శాంతి ఒప్పంద ప్రతిపాదన ముందుకు వస్తోంది.
ఇందులో భాగంగా, క్రిమియా భూభాగంపై రష్యా ఆధిపత్యాన్ని అంగీకరించేందుకు అమెరికా సిద్ధంగా ఉందన్న సంకేతాలు వెలుగులోకి వచ్చాయి.
ఈ ఒప్పందంతో రెండు దేశాల మధ్య వెంటనే కాల్పుల విరమణ అమల్లోకి రాబోతున్నట్లు సమాచారం.
ఈ శాంతి ప్రతిపాదనకు సంబంధించి రూపొందించిన ప్రాథమిక రూపురేఖలను ఉక్రెయిన్, యూరోపియన్ అధికారులు పారిస్‌లో సమీక్షించారు.
క్రిమియాపై రష్యా ఆధిపత్యాన్ని కొనసాగించడాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమర్థిస్తున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.
యూఎస్ విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ ఈ ప్రతిపాదన అంశంపై టెలిఫోన్‌లో చర్చలు జరిపారు.
వివరాలు
శాంతి ఒప్పందానికి ట్రంప్ పూర్తి మద్దతు
ఈ శాంతి ఒప్పందానికి ట్రంప్ పూర్తి మద్దతు ప్రకటించినట్లు విదేశాంగ కార్యదర్శి రూబియో ఇటీవల వెల్లడించారు.
యుద్ధాన్ని ముగించేందుకు ఇది ఒక విలువైన అవకాశం అని ట్రంప్ భావిస్తున్నారని తెలిపారు.
రష్యా ఆక్రమించిన భూభాగాలపై ఉక్రెయిన్ ఆశలు వదిలేయాల్సిన అవసరం ఉందని స్పష్టంగా చెప్పారు.
అలాంటి సందర్భంలోనే ఒప్పందం కుదిరి, యుద్ధం ముగిసే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు.
అయితే, యుద్ధం ముగింపు సాధ్యం కాకపోతే, చర్చలు విరమించడంతో పాటు, అమెరికా తన స్వంత దారిలో నడవాల్సి వస్తుందని హెచ్చరించారు.
వివరాలు
లండన్‌లో యూరోప్, ఉక్రెయిన్ ప్రతినిధులతో.. అమెరికా చర్చలు
ఈ ఒప్పందంలోని కొన్ని కీలక అంశాలపై ఇంకా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని వెల్లడించారు.
వచ్చే వారం లండన్‌లో యూరోప్, ఉక్రెయిన్ ప్రతినిధులతో కలిసి అమెరికా మరింత చర్చలు జరిపే అవకాశముందని తెలుస్తోంది.
ఇటీవల ఐరోపా దేశాల నేతలతో సమావేశమైన సమయంలో ట్రంప్ శాంతి ఒప్పందంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
తక్కువ కాలంలోనే ఈ ఒప్పందం అమలులోకి వచ్చే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు.
అమెరికా రూపొందించిన శాంతి ఒప్పంద ముసాయిదాను యూరోపియన్ నాయకులకు చూపించగా, వారు సానుకూల స్పందనను తెలిపారు అని విదేశాంగ శాఖ పేర్కొంది.
వివరాలు
మాస్కో దళాలు.. కర్కివ్ ప్రాంతాన్ని తిరిగి ఆక్రమించే ప్రయత్నాలు
యుద్ధ ముగింపులో భాగంగా, ఉక్రెయిన్‌తో ఖనిజ సంపదల ఒప్పందానికి సంబంధించి మెమోరాండం ఆఫ్ ఇంటెంట్‌పై కూడా సంతకాలు జరిగాయి.
అయితే, మరోవైపు మాస్కో దళాలు ఉక్రెయిన్ స్వాధీనం చేసుకున్న కర్కివ్ ప్రాంతాన్ని తిరిగి ఆక్రమించే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం.
యుద్ధానికి పూర్తి ముగింపు కావాలంటే, కొన్ని కీలక డిమాండ్లను ఉక్రెయిన్ అంగీకరించాల్సిన అవసరం ఉందని రష్యా స్పష్టం చేస్తోంది.
అందులో ముఖ్యంగా.. కీవ్‌కు నాటో సభ్యత్వం ఇవ్వకూడదని, విదేశీ సైనిక దళాలను ఉక్రెయిన్‌లో ప్రవేశించనీయకూడదని, క్రిమియాతో పాటు మరో నాలుగు ప్రావిన్స్‌లను రష్యా భాగంగా అంగీకరించాలని రష్యా డిమాండ్ చేస్తోంది.