LOADING...
H5N5 bird flu: అమెరికాను వణికిస్తున్న కొత్త వైరస్.. అరుదైన H5N5 బర్డ్ ఫ్లూ 
అమెరికాను వణికిస్తున్న కొత్త వైరస్.. అరుదైన H5N5 బర్డ్ ఫ్లూ

H5N5 bird flu: అమెరికాను వణికిస్తున్న కొత్త వైరస్.. అరుదైన H5N5 బర్డ్ ఫ్లూ 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 17, 2025
09:52 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో H5 N5 అంటూ కొత్త వైరస్‌ అలారం మోగిస్తోంది. వాషింగ్టన్‌ పరిసరాల్లో ఈ వైరస్‌ కలకలం రేపుతోంది. ఇప్పటివరకు జంతువుల్లోనే కనిపించే ఈ వైరస్‌, మొదటిసారిగా ఓ వ్యక్తిలో కనుగొనడం అక్కడి ఆరోగ్య వ్యవస్థను కంగారుపెడుతోంది. ఇప్పటికే ట్రంపాలజీతో షేకవుతోన్న అమెరికాకు మరో షాకింగ్‌ న్యూస్‌. మళ్లీ వైరస్‌ భయం అగ్రరాజ్యాన్ని చుట్టుముడుతోంది. బర్డ్‌ ఫ్లూకి దగ్గరైన లక్షణాలు ఉండే ఈ H5 N5 వైరస్‌ వాషింగ్టన్‌లోని ఒకరికి సోకినట్టు వైద్యులు ధృవీకరించారు. ఇది సాధారణంగా జంతువులకు మాత్రమే సోకే వైరస్‌ అయితే, మనిషిలో కనిపించడం ఇదే మొదటిసారి అని వారు చెప్పారు. ఈ వైరస్‌ చలికాలంలో ప్రభావం ఎక్కువగానే ఉంటుందని కూడా సూచిస్తున్నారు.

వివరాలు 

కోళ్ల ద్వారా ఈ వైరస్‌ 

ఒక జంతువు నుంచి మరొక జంతువుకు ఈ వైరస్‌ వ్యాపించే చరిత్ర ఉంది. కానీ ఇప్పుడు మనుషుల్లో కనిపించడం వైద్యులకు కొత్త సవాల్‌గా మారింది. ఆ వ్యక్తికి కోళ్ల ద్వారా ఈ వైరస్‌ సోకి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఆయనకు ముందే ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. గత ఏడాది అమెరికాలో బర్డ్‌ ఫ్లూ కేసులు ఏవీ రాలేదు. అయినా ఇప్పుడు దానికి సంబంధించినట్లే ఉన్న H5 N5 వైరస్‌ బయటపడడంతో ఆందోళన పెరిగింది. జంతువుల్లో సాధారణంగా కనిపించే ఈ వైరస్‌ ఇప్పుడు మనుషుల్లో వేగంగా వ్యాపిస్తుందా? దానికి నివారణ మార్గాలు ఏమిటి? వ్యాక్సిన్‌ అందుబాటులో ఉందా? అనే ప్రశ్నలు ముందుకు వస్తున్నాయి.

వివరాలు 

పౌల్ట్రీ రంగంలో పనిచేసే వారికి  వైద్యుల సూచన

H5 N5 వైరస్‌ మనుషులపై ప్రభావం చూపే అవకాశాలు చాలా తక్కువే అని వైద్యులు చెబుతున్నారు. అయినా ఈ వైరస్‌ను చిన్నచూపు చూడొద్దని హెచ్చరిస్తున్నారు. చాలా కాలం తర్వాత బర్డ్‌ ఫ్లూ తరహా వైరస్‌ ఆచూకీ దొరికిన నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వారు సూచించారు. ముఖ్యంగా కోడి మాంసాన్ని ప్రత్యక్షంగా ముట్టుకోవడం తగ్గించడం మంచిదన్నారు. పౌల్ట్రీ రంగంలో పనిచేసే వారు మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యుల సూచనలు.