US-Canada: కెనడాకు ట్రంప్ ఝలక్.. ఉమ్మడి రక్షణ మండలి నుంచి వైదొలిగిన అమెరికా
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయంతో కెనడాకు గట్టి సంకేతాలు పంపారు. రెండో ప్రపంచ యుద్ధ కాలం నుంచి కొనసాగుతున్న అమెరికా-కెనడా ఉమ్మడి రక్షణ మండలి నుంచి తాత్కాలికంగా తప్పుకుంటున్నట్లు ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. రక్షణ సంబంధిత హామీల అమలులో కెనడా ఆశించిన స్థాయిలో ముందుకు సాగలేదని అమెరికా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని అమెరికా రక్షణ శాఖ సహాయ కార్యదర్శి ఎల్‌బ్రిడ్జ్ కోల్బీ సామాజిక మాధ్యమ వేదికలో వెల్లడించారు. కెనడా తన రక్షణ బాధ్యతల విషయంలో నమ్మదగిన పురోగతి చూపలేకపోయిందని ఆయన విమర్శించారు. దీంతో శాశ్వత ఉమ్మడి రక్షణ మండలి ద్వారా అమెరికాకు లభిస్తున్న ప్రయోజనాలను మళ్లీ సమీక్షించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
వివరాలు
'ఓగ్డెన్స్‌బర్గ్ ఒప్పందం'
అందుకే మండలి నుంచి తాత్కాలికంగా వైదొలుగుతున్నామని స్పష్టం చేశారు. అమెరికా, కెనడాల మధ్య రక్షణ సహకారాన్ని బలోపేతం చేయడానికి 1940లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి. రూజ్‌వెల్ట్, కెనడా ప్రధాని మెకెంజీ కింగ్ కలిసి ఈ మండలిని ఏర్పాటు చేశారు. ఈ ఒప్పందాన్ని 'ఓగ్డెన్స్‌బర్గ్ ఒప్పందం' పేరుతో కూడా పిలుస్తారు. అప్పటి నుంచి ఇరుదేశాల భద్రతా వ్యవహారాల్లో ఈ మండలి కీలక పాత్ర పోషిస్తోంది. ఉమ్మడి రక్షణ బాధ్యతల్లో కెనడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని అమెరికా మరోసారి హెచ్చరించింది. అయితే అమెరికా తాజా నిర్ణయంపై కెనడా ప్రభుత్వం ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.
వివరాలు
నాటో దేశాల రక్షణ ఖర్చుల అంశంపై ట్రంప్ అసంతృప్తి
ఇక నాటో దేశాల రక్షణ ఖర్చుల అంశంపై ట్రంప్ చాలా కాలంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కెనడాతో పాటు ఇతర నాటో దేశాలు తమ సైనిక వ్యవస్థలపై తగినంత వ్యయం చేయడం లేదని, ఎక్కువ భారం అమెరికాపైనే పడుతోందని ఆయన పదేపదే ఆరోపిస్తున్నారు. మరోవైపు అధిక దిగుమతి సుంకాలు, అలాగే ట్రంప్-కెనడా ప్రధాని Mark Carney మధ్య నెలకొన్న విభేదాలతో ఇప్పటికే ఇరుదేశాల సంబంధాలు ఉద్రిక్తంగా మారాయి. ఈ పరిస్థితుల్లో అమెరికా తీసుకున్న తాజా నిర్ణయం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.