US President Convoy: బైడెన్ కాన్వాయ్‌ను ఢీకొట్టిన కారు.. డ్రైవర్‌పై తుపాకులు గురిపెట్టిన భద్రతా సిబ్బంది
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. అధ్యక్షుడు జో బైడెన్ కాన్వాయ్‌ను ఓ కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది.
ఈ ఆకస్మిక సంఘటన నేపథ్యంలో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది కారు డ్రైవర్‌ను చుట్టుముట్టారు. అతనిపై తుపాకులు గురిపెట్టారు.
ఈ ఘటన జరిగిన సమయంలో బైడెన్ వెంట అతని భార్య జిల్ బైడెన్ కూడా ఉన్నారు.
బైడెన్ కాన్వాయ్ డెలావేర్‌లోని అతని ప్రచార ప్రధాన కార్యాలయం వెలుపల ఉంది. ఈ క్రమంలో బైడెన్ తన కాన్వాయ్‌లో కారు ఎక్కబోతుండగా.. 40 మీటర్ల దూరంలో ఉన్న కాన్వాయ్‌లోని కారును.. వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది.
దీంతో బైడెన్ భద్రతా సిబ్బంది అందరూ అప్రమత్తమయ్యారు. అమెరికా అధ్యక్షుడిని వెంటనే మరొక వాహనంలో కూర్చోబెట్టి అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు.
బైడెన్
ఇద్దరూ క్షేమమమే: వైట్ హౌస్
బైడెన్, ఆయన భార్య ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వైట్ హౌస్ అధికారి ఒకరు తెలిపారు.
డెలావేర్‌లోని ప్రచార ప్రధాన కార్యాలయం వెలుపల ఉద్యోగులతో కలిసి డిన్నర్ చేయడానికి అధ్యక్షుడు జో బైడెన్ తన భార్య జిల్ బిడెన్‌తో కలిసి వచ్చారు.
అక్కడ జర్నలిస్టులతో బైడెన్ ముచ్చటిస్తుండగా.. అక్కడున్న వారందరికీ అకస్మాత్తుగా పెద్ద చప్పుడు వినిపించింది.
ప్రమాదం జరిగిన తర్వాత భద్రతా సిబ్బంది కారును చుట్టుముట్టగా.. డ్రైవర్ వెంటనే చేతులు ఎత్తేశాడు. నవంబర్ 13న జో బైడెన్ మనవరాలు నవోమీ బైడెన్ భద్రత విషయంలో కూడా పెద్ద లోపం వెలుగులోకి వచ్చింది.
ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు నవోమి ఎస్‌యూవీ కిటికీని పగలగొట్టడానికి ప్రయత్నించారు. అనంతరం నవోమి భద్రత సిబ్బంది వారిపై కాల్పులు జరిపారు.