Mister Singh Poster: 'మిస్టర్ సింగ్.. దేశం విడిచి వెళ్లండి'.. అమెరికా పోస్టర్‌పై దుమారం
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (DHS) రూపొందించిన ఏఐ ఆధారిత పోస్టర్‌పై తీవ్ర వివాదం చెలరేగింది. 'మిస్టర్ సింగ్' అంటూ దక్షిణాసియా వ్యక్తిని ఉద్దేశిస్తూ అమెరికా విడిచి వెళ్లాలని హెచ్చరించడం సిక్కు, దక్షిణాసియా వర్గాల్లో ఆగ్రహానికి కారణమైంది. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న కఠిన వలస విధానాల ప్రచారంలో భాగంగానే ఈ పోస్టర్‌ను విడుదల చేసినట్లు తెలుస్తోంది.
వివరాలు
పోస్టర్‌లో ఏముంది?
సెప్టెంబర్ 9న డీహెచ్‌ఎస్ తన అధికారిక 'ఎక్స్' ఖాతాలో ఈ గ్రాఫిక్‌ను ప్రచురించింది.
'ట్రాన్స్‌ఫార్మర్స్' సినిమా తరహా రూపకల్పనతో 'ట్రాన్స్‌ఫార్మర్స్: ఏజ్ ఆఫ్ డిపోర్టేషన్స్' అనే పేరును పోలిన శీర్షికను ఇందులో ఉపయోగించారు.
పోస్టర్ ఒకవైపు డీహెచ్‌ఎస్ లోగో ఉన్న భారీ ట్రాన్స్‌ఫార్మర్‌ను, మరోవైపు తలపాగా ధరించిన దక్షిణాసియా వ్యక్తిని చూపిస్తుంది.
అందులో అమెరికా అమెరికన్లకే అన్న భావనను వ్యక్తం చేస్తూ.. ''మా రోడ్ల నుంచి వెళ్లిపోండి. మిస్టర్ సింగ్, మీకు డ్రైవింగ్ రాదు'' అనే వ్యాఖ్యతోపాటు, ''స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్లండి లేదా పరిణామాలను ఎదుర్కోండి'' అనే హెచ్చరికను ఉంచారు.
అక్రమ వలసదారులపై సమాచారం అందించాలని, అలాగే స్వచ్ఛందంగా అమెరికా నుంచి వెళ్లే అవకాశాలను ఉపయోగించుకోవాలని పోస్టర్‌లో సూచించారు.
వివరాలు
'సింగ్' పేరుపై తీవ్ర అభ్యంతరాలు
పోస్టర్‌లో 'సింగ్' అనే పేరును ప్రత్యేకంగా ప్రస్తావించడంపైనే ప్రధానంగా విమర్శలు వస్తున్నాయి.
సిక్కు సమాజంలో 'సింగ్' అనేది విస్తృతంగా ఉపయోగించే పేరు. కొన్ని హిందూ వర్గాల్లోనూ ఈ పేరు సాధారణంగా కనిపిస్తుంది.
అంతేకాకుండా అమెరికా ట్రక్కింగ్ రంగంలో సిక్కుల ప్రాతినిధ్యం గణనీయంగా ఉంది.
దీంతో పోస్టర్ ద్వారా సిక్కు, దక్షిణాసియా సమాజాలను లక్ష్యంగా చేసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఫాక్స్ 7 ఆస్టిన్ యాంకర్, సిక్కు-అమెరికన్ అయిన అలెక్ నోలన్ ఈ పోస్టర్‌ను జాత్యహంకారపూరితంగా, అవమానకరంగా అభివర్ణించారు.
సిక్కు కోయిలిషన్, హిందూ అమెరికన్ ఫౌండేషన్ వంటి సంస్థలు కూడా పోస్టర్‌పై తీవ్రంగా స్పందించాయి.
ఇది జాతి వివక్షతోపాటు భారత వ్యతిరేక భావాలను ప్రోత్సహించేలా ఉందని ఆ సంస్థలు విమర్శించాయి.
వివరాలు
ఆన్‌లైన్‌లో వైరల్.. భిన్నాభిప్రాయాలు
డీహెచ్‌ఎస్ పోస్టు చేసిన ఈ గ్రాఫిక్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అవుతోంది.
కొంతమంది అక్రమ వలసదారుల బహిష్కరణకు సంబంధించిన ప్రభుత్వ సందేశానికి మద్దతు ఇస్తున్నారు.
అయితే మరికొందరు మాత్రం ఒక నిర్దిష్ట పేరును, దక్షిణాసియా వ్యక్తి రూపాన్ని ఉపయోగించడం ద్వారా జాత్యహంకార ధోరణిని ప్రదర్శించారని మండిపడుతున్నారు.
ఈ పోస్టర్‌పై సిక్కు, దక్షిణాసియా వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నప్పటికీ.. డీహెచ్‌ఎస్ ఇప్పటివరకు దీనిపై అధికారికంగా ఎలాంటి వివరణ ఇవ్వలేదు.