LOADING...
Birthright Citizenship: అమెరికాలో జన్మతః పౌరసత్వం రద్దు.. ఇది రాజ్యాంగబద్ధమా?
అమెరికాలో జన్మతః పౌరసత్వం రద్దు.. ఇది రాజ్యాంగబద్ధమా?

Birthright Citizenship: అమెరికాలో జన్మతః పౌరసత్వం రద్దు.. ఇది రాజ్యాంగబద్ధమా?

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 22, 2025
01:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జన్మతః పౌరసత్వం (Birthright Citizenship) రద్దు చేస్తూ కొత్త ఎగ్జిక్యూటివ్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయం అక్రమ వలసదారులతో పాటు విద్యార్థులు, ప్రొఫెషనల్స్ వంటి అనేక మంది జీవితాలపై ప్రభావం చూపనుంది. ఈ ఆదేశాల ప్రకారం, వలసదారులకు పుట్టే పిల్లలకు ఇకపై జన్మతః పౌరసత్వ హక్కు ఇవ్వబడదని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ నిర్ణయంపై భారతీయ సంతతి రాజకీయవేత్తలు తీవ్రంగా విమర్శించారు.

వివరాలు 

హెచ్‌1బీ వీసాలపై ఉన్న వారి పిల్లలపై కూడా ప్రభావం

అమెరికా చట్టసభ ప్రతినిధి రో ఖన్నా మాట్లాడుతూ, జన్మతః పౌరసత్వం రద్దు వల్ల హెచ్‌1బీ వీసాలపై ఉన్న వారి పిల్లలపై కూడా ప్రభావం పడుతుందని చెప్పారు. హెచ్‌1బీ వీసాలపై ఎక్కువగా భారత్, చైనాకు చెందిన వారు ఉన్నారు. అయితే చట్టబద్ధంగా వలస వచ్చిన వారితో పాటు తాత్కాలిక స్టూడెంట్ వీసాలపై ఉన్న వారికి కూడా ఈ నిర్ణయం ఇబ్బందులు కలిగిస్తుందని రో ఖన్నా అభిప్రాయపడ్డారు. ట్రంప్ ఇచ్చిన ఆదేశాలు ఎంత కఠినమైనవైనా, జన్మతః పౌరసత్వ హక్కు కోసం పోరాడతానని భారతీయ సంతతికి చెందిన మరో ప్రతినిధి శ్రీ థానేధార్ ప్రకటించారు. ట్రంప్ ఆదేశాలు అమెరికా రాజ్యాంగానికి వ్యతిరేకమని ప్రతినిధి ప్రమీలా జయపాల్ తెలిపారు.

వివరాలు 

 22 రాష్ట్రాల్లో అటార్నీ జనరల్స్ కేసులు దాఖలు 

కేవలం ఒక పెన్ను సంతకంతో ఈ హక్కును రద్దు చేయడం రాజ్యాంగాన్ని అవమానించడమే అవుతుందని, దీన్ని ఆమోదించడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు. ఇమ్మిగ్రేషన్ రైట్స్ గ్రూపులు ఈ ఆదేశాలను వ్యతిరేకిస్తూ కోర్టులో కేసులు వేశాయని ప్రమీలా తెలిపారు. జన్మతః పౌరసత్వం రద్దు ఆదేశాల ప్రకారం,2025 ఫిబ్రవరి 19వ తేదీ తర్వాత,తల్లిదండ్రులు అమెరికా పౌరులు లేదా శాశ్వత నివాసితులు కాకపోతే,వారిచే జన్మించిన పిల్లలకు ఆటోమేటిక్ పౌరసత్వం ఇవ్వబడదని పేర్కొన్నారు. ట్రంప్ ఆదేశాలను సవాల్ చేస్తూ 22 రాష్ట్రాల్లో అటార్నీ జనరల్స్ కేసులు దాఖలు చేశారు.

వివరాలు 

ట్రంప్ నిర్ణయంపై చట్టపరంగా,రాజ్యాంగపరంగా అనేక విమర్శలు 

అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం, అమెరికాలో జన్మించిన ప్రతి ఒక్కరికీ ఆటోమేటిక్ పౌరసత్వం కలుగుతుంది. అయితే, 18 రాష్ట్రాలు, రెండు నగరాలు ఈ సవరణను ప్రస్తావిస్తూ కోర్టులో వ్యాజ్యం వేశాయి. ఈ విధంగా ట్రంప్ నిర్ణయం చట్టపరంగా, రాజ్యాంగపరంగా అనేక విమర్శలను ఎదుర్కొంటోంది.