Donald Trump: భారతీయ బియ్యంపై పన్ను విధించే ఆలోచనలో ట్రంప్
ఈ వార్తాకథనం ఏంటి
ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై భారత్-అమెరికాల మధ్య చర్చలు మొదలవడానికి సిద్ధమవుతున్న వేళ,ఓ కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది. భారత్ నుంచి అమెరికాకు వెళ్లే బియ్యం దిగుమతులపై అదనపు సుంకాలు విధించే అంశాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. తక్కువ ధరలతో విదేశాల నుంచి వస్తున్న వస్తువులు తమదేశ రైతులను నష్టపరుస్తున్నాయంటూ అమెరికారైతులు ఫిర్యాదు చేయడంతో ఈనిర్ణయంపై ట్రంప్ ఆలోచనలు చేస్తున్నారని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. దీనికిసంబంధించి అమెరికా రైతుల కోసం ప్రకటించిన 12బిలియన్ డాలర్ల బెయిల్ అవుట్ ప్యాకేజీ ప్రారంభ సందర్భంగా వైట్‌హౌస్‌లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ, అనేకదేశాలు చౌక ధరలతో బియ్యాన్ని అమెరికామార్కెట్‌లోకి అక్రమంగా డంప్ చేస్తున్నాయనే ఆరోపణలను తమప్రభుత్వం సవివరంగా పరిశీలిస్తోందని తెలిపారు.
వివరాలు
డంప్ చేస్తున్న దేశాల జాబితాలో భారత్, థాయ్‌లాండ్, చైనా
సమావేశానికి హాజరైన పలువురు రైతులు, సబ్సిడీతో వస్తున్న బియ్యం దిగుమతులు తమ మార్కెట్‌ను దెబ్బతీస్తూ దేశీయ ధరలను పడగొడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ, వీటిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనికి ట్రంప్ స్పందిస్తూ, కొన్ని దేశాలు మోసం చేస్తున్నాయని, అవసరమైతే సుంకాల విధింపు మార్గానికే వెళ్లవచ్చని స్పష్టం చేశారు. ఇక ఈ సందర్భంగా కెనడా నుంచి ఎరువుల దిగుమతుల అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఇదే సమావేశంలో రైస్‌మిల్ సీఈఓ మెరిల్ కెన్నెడీ మాట్లాడుతూ, అమెరికా మార్కెట్‌లో తమ ఉత్పత్తులను డంప్ చేస్తున్న దేశాల జాబితాలో భారత్, థాయ్‌లాండ్, చైనాలు ముందున్నాయని పేర్కొన్నారు.
వివరాలు
కొంతవరకు ఉపయోగపడుతున్న సుంకాలు
చైనా ఉత్పత్తులు ప్యూర్టోరికో వరకు చేరుతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఎన్నేళ్లుగా ప్యూర్టోరికోకు బియ్యం ఎగుమతులు చేయడం లేదని చెప్పారు. ఈ పరిణామాలతో దక్షిణ ప్రాంతాల్లో తాము తీవ్రంగా నష్టపోతున్నామన్నారు. ప్రస్తుతం అధ్యక్షుడు విధించిన సుంకాలు కొంతవరకు ఉపయోగపడుతున్నాయని, అయితే వాటిని మరింత పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ట్రంప్ మాట్లాడుతూ, ఇప్పటికే పలు దేశాలపై విధించిన సుంకాలను రెట్టింపు చేయాలా అని రైతులను ప్రశ్నించారు. దీనికి రైతులు స్పందిస్తూ, ఇతర దేశాల నుంచి దిగుమతులపై కట్టుదిట్టమైన నియంత్రణ చర్యలు తీసుకోవాలని కోరారు.
వివరాలు
తక్షణమే తగిన చర్యలు
తమ దేశ రైతుల ఉత్పత్తులకు నష్టం కలిగిస్తున్న దేశాల వివరాలతో కూడిన పూర్తి జాబితాను అందజేయాలంటూ వాణిజ్య కార్యదర్శి స్కాట్ బెసెంట్‌ను ట్రంప్ ఆదేశించారు. ఈ నేపథ్యంలోస్పందించిన స్కాట్ బెసెంట్,ఈ జాబితాలో భారత్, థాయ్‌లాండ్, చైనాలు అగ్రస్థానాల్లో ఉన్నాయని తెలిపారు. ఇంకా మరికొన్ని దేశాలు కూడా ఉన్నాయని, అన్ని వివరాలతో కూడిన జాబితాను త్వరలో సమర్పిస్తామని చెప్పారు. ఈ అంశంపై తక్షణమే తగిన చర్యలు తీసుకుంటామని ట్రంప్ హామీ ఇచ్చారు.
వివరాలు
ఈ నెల 10 నుంచి భారత్-అమెరికాల మధ్య ట్రేడ్ డీల్‌పై చర్చలు
ముఖ్యంగా భారత్‌తో వాణిజ్య ఒప్పంద చర్చలకు ముందే అదనపు సుంకాలపై ట్రంప్ ఆలోచించడం గమనార్హంగా మారింది. ఇదిలా ఉండగా, భారత్-అమెరికాల మధ్య ట్రేడ్ డీల్‌పై చర్చలు ఈ నెల 10 నుంచి దిల్లీలో ప్రారంభం కానున్నాయి. ఇందులో పాల్గొనేందుకు అమెరికా డిప్యూటీ వాణిజ్య ప్రతినిధి రిక్ స్విట్జర్ నేతృత్వంలోని బృందం భారత్‌కు రానుంది. ఈ చర్చల్లో భారత పక్షాన వాణిజ్య కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ పాల్గొననున్నారు.