US: అమెరికా జాబ్ గ్రీన్ కార్డులపై కొత్త రూల్స్.. కంపెనీలకు ట్రంప్ సర్కార్ షాక్!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే విదేశీ నిపుణులకు, వారికి గ్రీన్ కార్డులు స్పాన్సర్ చేసే కంపెనీలకు ట్రంప్ ప్రభుత్వం మరో షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డుల (Employment-Based Green Cards) జారీ ప్రక్రియలో కీలక మార్పులు తీసుకురావాలని ప్రతిపాదిస్తోంది. ఇందులో భాగంగా విదేశీ ఉద్యోగులకు గ్రీన్ కార్డులు స్పాన్సర్ చేసే ముందు అమెరికా పౌరులకు ప్రాధాన్యం ఇవ్వాలని కొత్త నిబంధన తీసుకురావాలని భావిస్తోంది. ఈ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే విదేశీ ఉద్యోగులకు శాశ్వత నివాస హోదా కల్పించే ప్రక్రియ కంపెనీలకు మరింత కఠినంగా మారనుంది.
వివరాలు
అమెరికా ఉద్యోగులకే తొలి ప్రాధాన్యం.. PERM విధానంలో కీలక మార్పులు!
అమెరికా కంపెనీలు విదేశీ ఉద్యోగులను స్పాన్సర్ చేయడానికి ముందు అర్హులైన స్థానిక అభ్యర్థులకు అవకాశం కల్పించాలని కార్మిక శాఖ ప్రతిపాదిస్తోంది.
ఈ విషయాన్ని అమెరికా కార్మిక శాఖ కార్యదర్శి కీత్ సోడర్లింగ్ వెల్లడించారు.
ప్రపంచంలోనే అమెరికా ఉద్యోగులు అత్యుత్తమమని, అధిక నైపుణ్యం అవసరమయ్యే, ఎక్కువ వేతనాలు లభించే ఉద్యోగాల్లో మొదట వారికి అవకాశం దక్కాలని ఆయన పేర్కొన్నారు.
విదేశీ ఉద్యోగులను నియమించుకునే ముందు అర్హత కలిగిన అమెరికా పౌరులకు ఉద్యోగావకాశాలు కల్పించేలా కొత్త నిబంధనలను రూపొందిస్తున్నట్లు తెలిపారు.
కార్మిక శాఖ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే దాదాపు 20 ఏళ్ల తర్వాత PERM విధానంలో అమెరికా ప్రభుత్వం కీలక మార్పులు చేసినట్లవుతుంది.
వివరాలు
అమెరికా ఉద్యోగుల వేతనాలు, పని పరిస్థితులపై దృష్టి!
ప్రస్తుతం EB-2, EB-3 కేటగిరీల కింద ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే విదేశీ ఉద్యోగులకు PERM ప్రక్రియ చాలా కీలకం.
ఈ విధానంలో భాగంగా విదేశీ ఉద్యోగిని శాశ్వతంగా నియమించుకోవడానికి ముందు ఆ ఉద్యోగానికి సరిపోయే అర్హతలు కలిగిన అమెరికా ఉద్యోగులు అందుబాటులో లేరని సంబంధిత కంపెనీలు నిరూపించాల్సి ఉంటుంది.
తాజాగా ప్రతిపాదించిన మార్పుల ప్రకారం ఈ నిబంధనలను మరింత కఠినతరం చేయనున్నారు.
విదేశీ ఉద్యోగిని నియమించుకోవడం వల్ల అమెరికా ఉద్యోగుల వేతనాలు, పని పరిస్థితులపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడకుండా కంపెనీలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
వివరాలు
ఉద్యోగ నియామకాల్లో అమెరికన్లకు ప్రాధాన్యం.. తొలగింపులపైనా ఆంక్షలు!
అంతేకాకుండా ఉద్యోగ నియామకాల కోసం కంపెనీలు విస్తృతంగా ప్రకటనలు ఇవ్వాల్సి ఉంటుంది.
తమ అధికారిక వెబ్‌సైట్లు, ఆన్‌లైన్ జాబ్ పోర్టల్స్‌తో పాటు సోషల్ మీడియా వేదికల్లోనూ ఉద్యోగ ఖాళీల వివరాలను ప్రచురించాలి.
వీటితోపాటు జాబ్ ఫెయిర్లు, కళాశాలల్లో క్యాంపస్ రిక్రూట్‌మెంట్ల ద్వారా కూడా అభ్యర్థులను ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది.
ఉద్యోగానికి అర్హత కలిగిన అమెరికా అభ్యర్థుల దరఖాస్తులను కంపెనీలు నిజాయితీగా పరిశీలించాలి.
అర్హత ఉన్నప్పటికీ వారిని ఎంపిక చేయకపోతే అందుకు సరైన కారణాలను వెల్లడించాల్సి ఉంటుంది.
మరో కీలక నిబంధన కూడా ప్రతిపాదనల్లో ఉంది. గత రెండేళ్లలో కంపెనీలు అమెరికా ఉద్యోగులను తొలగించి ఉంటే,వారి స్థానాల్లో విదేశీ ఉద్యోగులను నియమించుకోవడంపై పరిమితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
వివరాలు
కొత్త నిబంధనల అమలుకు 60 రోజుల గడువు..
అంటే స్థానిక ఉద్యోగులను తొలగించిన కంపెనీలు ఆ ఖాళీలను విదేశీ ఉద్యోగులతో భర్తీ చేయడం అంత సులభం కాదు.
ఈ ప్రతిపాదనలపై ప్రజల అభిప్రాయాలను సేకరించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోనున్నారు. ముందుగా వీటిని ఫెడరల్ రిజిస్టర్‌లో ప్రచురిస్తారు.
అనంతరం 60 రోజుల పాటు ప్రజలు తమ అభ్యంతరాలు, సూచనలు తెలియజేసేందుకు అవకాశం కల్పిస్తారు.
ఈ అభిప్రాయాలను పరిశీలించిన తర్వాత నిబంధనలను తుది రూపంలోకి తీసుకొచ్చి అమల్లోకి తీసుకురానున్నారు.
ఈ మార్పులు అమలైతే అమెరికాలో ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న విదేశీ నిపుణులతో పాటు వారిని నియమించుకోవాలనుకునే కంపెనీలపైనా ప్రభావం పడే అవకాశం ఉంది.