US: యూఎస్ కీలక నిర్ణయం.. మధ్యప్రాచ్యానికి 2,500 మెరైన్స్, భారీ యుద్ధనౌక!
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో యూఎస్ తన సైనిక బలగాలను మరింతగా మోహరించేందుకు చర్యలు చేపట్టింది. తాజా పరిణామాల ప్రకారం సుమారు 2,500 మంది మెరైన్స్ సైనికులతో పాటు ఒక భారీ యుద్ధ నౌకను కూడా మధ్యప్రాచ్యానికి తరలించాలని అమెరికా నిర్ణయించింది. అమెరికా అధికారుల సమాచారం మేరకు, 31వ మెరైన్ ఎక్స్‌పెడిషనరీ యూనిట్ కు చెందిన దళాలు, అంబిఫియస్ అసాల్ట్ షిప్ USS ట్రిపోలీను మధ్యప్రాచ్య దిశగా పంపాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మెరైన్ ఎక్స్‌పెడిషనరీ యూనిట్లు అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించేందుకు ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి. ఇవి అంబిఫియస్ దాడులతో పాటు ఎంబసీల భద్రత, పౌరుల తరలింపు, మానవతా సహాయ కార్యక్రమాల్లో కూడా కీలక పాత్ర పోషిస్తాయి.
Details
వారం రోజుల సమయం పట్టే అవకాశం
అయితే ఈ బలగాల తరలింపు వల్ల వెంటనే భూసైనిక చర్యలు ప్రారంభమవుతాయని అర్థం కాదని అధికారులు స్పష్టం చేశారు. పరిస్థితులను బట్టి వివిధ రకాల ఆపరేషన్లకు ఈ దళాలను వినియోగించుకునే సామర్థ్యం ఉందని తెలిపారు. ప్రస్తుతం ఈ దళాలు జపాన్ లోని స్థావరాల్లో ఉన్నాయి. అక్కడి నుంచి బయలుదేరిన ఈ యుద్ధ నౌకలు ఇటీవలి రోజుల్లో పసిఫిక్ మహాసముద్రం ప్రాంతంలో సంచరిస్తున్నట్లు సైనిక చిత్రాలు సూచిస్తున్నాయి. ఇరాన్ సమీప జలాలకు చేరుకోవడానికి ఈ నౌకలకు కనీసం వారం రోజుల సమయం పట్టే అవకాశముందని అధికారులు తెలిపారు.
Details
గల్ఫ్ దేశాలపై క్షిపణులు, డ్రోన్ల దాడులు
ఇదిలా ఉండగా, పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఇరాన్ ఇప్పటికే ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై క్షిపణులు, డ్రోన్ల దాడులు జరుపుతోంది. అలాగే ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన మార్గమైన హార్ముజ్ జలసంధి ను కూడా ఇరాన్ ప్రభావవంతంగా మూసివేసినట్లు సమాచారం. ఈ మార్గం ద్వారా ప్రపంచవ్యాప్తంగా వ్యాపారం అయ్యే చమురులో దాదాపు ఐదో వంతు రవాణా జరుగుతుంది. ఇక అమెరికా నౌకాదళం ఇప్పటికే అరేబియన్ సముద్రంలో బలగాలను మోహరించింది. అక్కడ ప్రస్తుతం 12 యుద్ధ నౌకలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వీటిలో అణు శక్తితో నడిచే విమాన వాహక నౌక USS అబ్రహం లింకన్ తో పాటు ఎనిమిది డిస్ట్రాయర్లు ఉన్నాయి.
Details
రోజుకు సగటున 1,000కు పైగా దాడులు
ఇప్పుడు USS ట్రిపోలీ కూడా చేరితే, అది ఆ ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న రెండో అతిపెద్ద యుద్ధ నౌకగా మారనుంది. మధ్యప్రాచ్య ప్రాంతంలో అమెరికా సైనికుల మొత్తం సంఖ్యపై స్పష్టత లేకపోయినా కతార్ లో మాత్రమే సాధారణంగా సుమారు 8,000మంది అమెరికా సైనికులు ఉండటం తెలిసిందే. ఇదే సమయంలో అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సేత్ మాట్లాడుతూ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అమెరికా బలగాలు15,000కు పైగా శత్రు లక్ష్యాలపై దాడులు జరిపాయని తెలిపారు. రోజుకు సగటున 1,000కు పైగా దాడులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. హార్ముజ్ జలసంధిలో రవాణా అంతరాయం కలిగించే ఇరాన్ ప్రయత్నాలపై ఆందోళన అవసరం లేదని కూడా ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా లెబనాన్‌లో మానవతా పరిస్థితులు మరింత విషమంగా మారాయి.
Details
ఇది నాలుగో విమాన ప్రమాదం
లెబనాన్ లో ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లాహ్ మిలిటెంట్లపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగించడంతో ఇప్పటివరకు దాదాపు 800 మంది మరణించగా, సుమారు 8.5 లక్షల మంది నివాసాలు విడిచి వెళ్లినట్లు సమాచారం. ఇక ఇరాన్ లో జరిగిన ఒక ఘటనలో అమెరికా వైమానిక దళానికి చెందిన KC-135 స్ట్రాటోట్యాంకర్ ఇంధన సరఫరా విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలోని ఆరుగురు సిబ్బంది మరణించారు. ఈ ఘటనతో ఈ ఘర్షణల్లో ఇప్పటివరకు మరణించిన అమెరికా సైనికుల సంఖ్య కనీసం 13కు చేరింది. అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకారం ఇటీవల ఇరాన్‌పై అమెరికా సైనిక ఆపరేషన్లకు సంబంధించి ఇది నాలుగో విమాన ప్రమాదంగా గుర్తించబడింది.