US sanctions: అతిపెద్ద రష్యా చమురు సంస్థలపై అమెరికా ఆంక్షలు.. సరికొత్త వ్యూహంతో ట్రంప్
ఈ వార్తాకథనం ఏంటి
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగిసే దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రయత్నాలను మరింత వేగవంతం చేశారు. ఈ క్రమంలో రష్యాకు చెందిన రెండు ప్రముఖ చమురు సంస్థలపై కొత్త ఆంక్షలు విధిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో జరగాల్సిన ట్రంప్ భేటీ వాయిదా పడిన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అమెరికా ట్రెజరీ శాఖకు చెందిన ఆఫీస్ ఆఫ్ ఫారిన్ అసెట్స్ కంట్రోల్ (OFAC) ఈ ఆంక్షలపై అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే విషయంలో రష్యా సహకారం చూపకపోవడం,శాంతి ప్రక్రియ పట్ల నిబద్ధత కనబరచకపోవడం వల్లే ఈ చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొంది.
వివరాలు
శాశ్వత శాంతి సాధ్యం కావాలంటే రష్యా చర్చల బాట పట్టాల్సిందే
ఈ నిర్ణయం రష్యా చమురు రంగంపై తీవ్ర ఒత్తిడి సృష్టిస్తుందని, తద్వారా ఆ దేశ ఆర్థిక వ్యవస్థకూ గణనీయమైన దెబ్బ తగులుతుందని వివరణ ఇచ్చింది. శాశ్వత శాంతి సాధ్యం కావాలంటే రష్యా చర్చల బాట పట్టాల్సిందేనని ట్రెజరీ స్పష్టం చేసింది. ట్రంప్ మాట్లాడుతూ..ఇవి అపారమైన ఆంక్షలన్నారు. అయితే, ఇవి ఎక్కువకాలం ఉండవని, ఈలోపు యుద్ధ సమస్య పరిష్కారమవుతుందని వ్యాఖ్యానించారు. ఈ చర్యకు ఇదే సరైన సమయం అని తాను భావిస్తున్నట్లు కూడా తెలిపారు.
వివరాలు
రష్యాపై ఒత్తిడి పెంచేందుకు యూరోపియన్ యూనియన్ మరో అడుగు
అదే సమయంలో ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ కూడా స్పందిస్తూ, ఈ ఆంక్షలు యుద్ధం కారణంగా జరుగుతున్న హత్యలను అరికట్టడంలో, తక్షణ కాల్పుల విరమణ సాధించడంలో సహాయపడతాయని అన్నారు. అమెరికా మిత్ర దేశాలు కూడా ఈ చర్యలకు మద్దతుగా నిలవాలని, ఆంక్షలను పాటించాలని పిలుపునిచ్చారు. ట్రెజరీ ప్రకటన ప్రకారం, ఈ చర్యలతో రష్యా తన సైనిక చర్యలకు అవసరమైన నిధులు సమకూర్చుకునే సామర్థ్యం తగ్గిపోతుంది. అదే సమయంలో చమురు ఆధారిత ఆర్థిక వ్యవస్థ బలహీనపడే అవకాశం ఉందని పేర్కొంది. ఇక యూరోపియన్ యూనియన్ (EU) కూడా రష్యాపై ఒత్తిడి పెంచేందుకు మరో అడుగు వేసింది. 19 కొత్త ఆంక్షల ప్యాకేజీకి ఆమోదం తెలుపుతూ, రష్యా ఎల్‌ఎన్‌జీ (LNG) దిగుమతులపై నిషేధం విధించింది.
వివరాలు
భారత్ హామీ ఇచ్చింది : ట్రంప్
ఇదిలావుంటే, రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేసే అంశంపై ట్రంప్ మరోసారి స్పందించారు. ఈ ఏడాది చివరి నాటికి భారత్ రష్యా చమురు దిగుమతులను గణనీయంగా తగ్గిస్తుందని చెప్పారు. ఈ తగ్గింపు దశలవారీగా జరుగుతుందని, ఇది సానుకూల చర్యగా భావిస్తున్నానని పేర్కొన్నారు. భారత్ ఈ విషయంపై ఇప్పటికే తనకు హామీ ఇచ్చిందని కూడా ట్రంప్ వెల్లడించారు. అయితే గతంలో కూడా ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పటికీ, భారత ప్రభుత్వం వాటిని ఖండించింది. అయినప్పటికీ ట్రంప్ మళ్లీ అదే అంశంపై వ్యాఖ్యలు చేయడం అంతర్జాతీయ వర్గాల దృష్టిని ఆకర్షిస్తోంది.