Ebola: ఆరుగురు అమెరికన్లకు ఎబోలా.. ఆఫ్రికాలో వేగంగా విస్తరిస్తోన్న వ్యాధి
ఈ వార్తాకథనం ఏంటి
ఆఫ్రికాలోని కాంగో, ఉగాండా తదితర దేశాల్లో ఎబోలా వైరస్ వేగంగా వ్యాపిస్తూ ఆందోళన కలిగిస్తోంది. ఈ ప్రాణాంతక వ్యాధి కారణంగా ఇప్పటికే వంద మంది ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. మరో 390 అనుమానిత కేసులు నమోదైనట్లు సమాచారం. కాంగోలో ఆరుగురు అమెరికా పౌరులకు కూడా ఎబోలా సోకినట్లు గుర్తించారు. వీరిని క్వారంటైన్‌లో ఉంచేందుకు సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అమెరికా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఎబోలా వ్యాప్తి వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో భారత్ కూడా అప్రమత్తమైంది. ఈ వైరస్ పరిస్థితిని జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం నిరంతరం పర్యవేక్షిస్తోందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలోకి ఈ వ్యాధి ప్రవేశించకుండా ప్రత్యేక నిఘా చర్యలు అమలు చేస్తున్నట్లు తెలిపింది.
వివరాలు
భారత్‌లో నమోదు కానీ ఎబోలా కేసులు
ప్రస్తుతం భారత్‌లో ఎబోలా కేసులు నమోదు కాలేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయితే అంతర్జాతీయ ప్రయాణాలు, ప్రపంచ దేశాలతో పెరుగుతున్న అనుసంధానం కారణంగా అంటువ్యాధుల విషయంలో ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని దిల్లీ ఎయిమ్స్‌కు చెందిన కమ్యూనిటీ వైద్య విభాగం ప్రొఫెసర్ డాక్టర్ సంజయ్ రాయ్ హెచ్చరించారు. ప్రస్తుతం దేశానికి ఎబోలా ముప్పు తక్కువగానే ఉన్నప్పటికీ పరిస్థితిని నిర్లక్ష్యం చేయరాదని ఆయన సూచించారు.