Iran-USA: ఇరాన్‌పై అమెరికా దూకుడు? పశ్చిమాసియాలో 50 ఫైటర్ జెట్లు మోహరింపు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అణు ఒప్పందంపై ఇరుదేశాల మధ్య చర్చలు జరుగుతున్న సమయంలో కీలకమైన పరిణామం వెలుగులోకి వచ్చింది. కేవలం 24 గంటల్లోనే అమెరికా దాదాపు 50 అత్యాధునిక యుద్ధ విమానాలను పశ్చిమాసియా ప్రాంతానికి తరలించింది. దీంతో అగ్రరాజ్యం ఎప్పుడు, ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అంతర్జాతీయ వర్గాల్లో ఆందోళన నెలకొంది. చర్చలు ఫలితం ఇవ్వకపోతే సైనిక చర్యకు వెనుకాడబోమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రారంభం నుంచే ఇరాన్‌ను హెచ్చరిస్తూ వస్తున్నారు. జెనీవాలో ఇరుదేశాల మధ్య జరిగిన రెండో దశ చర్చలు తాజాగా ముగిశాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా తన ఫైటర్ జెట్లను మధ్యప్రాచ్యానికి పంపడం ప్రాధాన్యం సంతరించుకుంది.
వివరాలు
మూడు గైడెడ్ క్షిపణి డిస్ట్రాయర్ నౌకలు
ఈ చర్యలను అమెరికా అధికార వర్గాలే ధ్రువీకరించాయని పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అమెరికాకు చెందిన ఎఫ్-22, ఎఫ్-16, ఎఫ్-35 తరహా యుద్ధ విమానాలతో పాటు గగనతలంలోనే ఇంధనం నింపుకునే యుద్ధ విమానాలు కూడా మధ్యప్రాచ్య దిశగా కదులుతున్నట్లు ఫ్లైట్ ట్రాకింగ్ వివరాలు సూచిస్తున్నాయి. ఇదే సమయంలో,అమెరికా నౌకాదళానికి చెందిన భారీ విమాన వాహక నౌక యూఎస్‌ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ కరేబియన్ సముద్రం నుంచి పశ్చిమాసియా వైపు ప్రయాణిస్తున్నట్లు ఒక నేవీ అధికారి వెల్లడించారు. ఈ నౌకతో పాటు యూఎస్‌ఎస్ మహాన్, యూఎస్‌ఎస్ బెయిన్‌బ్రిడ్జ్, యూఎస్‌ఎస్ విన్స్టన్ చర్చిల్ అనే మూడు గైడెడ్ క్షిపణి డిస్ట్రాయర్ నౌకలు కూడా ఉన్నాయని తెలిపారు.
వివరాలు
సానుకూలంగా జెనీవాలో చర్చలు.. వెల్లడించిన అమెరికా,ఇరాన్
ఇప్పటికే యూఎస్‌ఎస్ అబ్రహం లింకన్ విమాన వాహక నౌకతో పాటు పలువురు యుద్ధ విమానాలను ఈ ప్రాంతంలో మోహరించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా,జెనీవాలో జరిగిన చర్చలు సానుకూలంగా సాగాయని అమెరికా,ఇరాన్ రెండు దేశాలు వెల్లడించాయి. చర్చల్లో కొంత పురోగతి కనిపించిందని, అయితే కొన్ని అంశాలపై ఇంకా స్పష్టత అవసరమని అమెరికా అధికారులు తెలిపారు. ఒప్పందానికి దారితీసే మార్గం క్రమంగా స్పష్టమవుతోందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి పేర్కొన్నారు.
వివరాలు
మిశ్రమ ఫలితాలను ఇచ్చిన చర్చలు
మరోవైపు, తాజా చర్చలు మిశ్రమ ఫలితాలను ఇచ్చాయని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వ్యాఖ్యానించారు. ఇరాన్ ఇప్పటికీ అంగీకరించని కొన్ని కఠినమైన షరతులను అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించారని చెప్పారు. అమెరికా దౌత్యపరమైన పరిష్కారాలకే ప్రాధాన్యం ఇస్తుందని స్పష్టం చేస్తూనే, అవసరమైతే ఇతర మార్గాలు కూడా తమ వద్ద ఉన్నాయని ఆయన హెచ్చరించారు.