Immigration Applications: అమెరికాలో ఇమిగ్రేషన్ అప్లికేషన్లకు ఆన్‌లైన్ ఫైలింగ్ తప్పనిసరి
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా ప్రభుత్వం వలసలను నియంత్రించే దిశగా ఇప్పటికే అమల్లో ఉన్న విధానాలను మరింత కఠినతరం చేస్తోంది. ఇందులో భాగంగా ఇమిగ్రేషన్‌కు సంబంధించిన పలు ప్రయోజనాల కోసం దరఖాస్తు చేసుకునే వలసదారులు ఇకపై ఆన్‌లైన్‌లోనే అప్లికేషన్లు సమర్పించేలా కొత్త నిబంధనను తీసుకొచ్చింది. గ్రీన్‌కార్డు, పౌరసత్వం, ఆశ్రయం వంటి ప్రయోజనాలకు ఈ విధానం వర్తించనుంది. మెరుగైన సేవలు.. తక్కువ నిర్వహణ ఖర్చులు వలసదారులకు వేగంగా, మెరుగైన సేవలు అందించడంతో పాటు నిర్వహణ వ్యయాలను తగ్గించడమే ఈ మార్పు ప్రధాన ఉద్దేశమని యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) పేర్కొంది. ఈ మేరకు కొత్త నిబంధనను సోమవారం ఫెడరల్ రిజిస్టర్‌లో ప్రచురించింది.
వివరాలు
180 రోజుల తర్వాత ఈ-ఫైలింగ్ మాత్రమే
కొత్త నిబంధన ప్రకారం సంబంధిత ఇమిగ్రేషన్ అప్లికేషన్లు 180 రోజుల పాటు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి.
ఈ వ్యవధి పూర్తైన తర్వాత ఆయా దరఖాస్తులను పూర్తిగా ఎలక్ట్రానిక్ విధానంలోనే సమర్పించాల్సి ఉంటుంది.
అంటే, సంబంధిత ప్రయోజనాల కోసం దరఖాస్తు చేసుకునే వారు ఈ-ఫైలింగ్ విధానాన్ని తప్పనిసరిగా అనుసరించాల్సి ఉంటుంది.
వివరాలు
ఏ దరఖాస్తులకు వర్తిస్తుంది?
కొత్త ఆన్‌లైన్ ఫైలింగ్ విధానం కింద గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తులు, వాటి రెన్యువల్స్, కుటుంబ ఆధారిత పిటిషన్లు, అమెరికా పౌరసత్వం కోసం దరఖాస్తులు, ఆశ్రయం కోసం చేసే అభ్యర్థనలు, ఉపాధి అనుమతి కోసం అప్లికేషన్లు, తాత్కాలిక రక్షిత హోదా (Temporary Protected Status) కింద ప్రయోజనాలు పొందేందుకు చేసే దరఖాస్తులు ఉంటాయి.
ప్రస్తుతం సాధారణంగా దరఖాస్తుదారులు యూఎస్‌సీఐఎస్ ఆన్‌లైన్ అకౌంట్ ద్వారా సంబంధిత ఫారాలను పూర్తి చేస్తున్నారు.
కొత్త నిబంధన పూర్తిగా అమల్లోకి వచ్చిన తర్వాత ఇమిగ్రేషన్ సంబంధిత ఈ దరఖాస్తులన్నింటికీ ఆన్‌లైన్ ఫైలింగ్ విధానమే ప్రధాన మార్గంగా మారనుంది.