LOADING...
Us-India: 'ఇండో' పేరు మార్చి.. మ్యాప్ మార్చి.. భారత్‌కు అమెరికా షాక్!
'ఇండో' పేరు మార్చి.. మ్యాప్ మార్చి.. భారత్‌కు అమెరికా షాక్!

Us-India: 'ఇండో' పేరు మార్చి.. మ్యాప్ మార్చి.. భారత్‌కు అమెరికా షాక్!

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 17, 2026
01:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఒకప్పుడు ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత్ తమకు అత్యంత కీలక వ్యూహాత్మక భాగస్వామి అని ప్రపంచానికి చాటిచెప్పిన అమెరికా.. ఇప్పుడు తీసుకున్న తాజా నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహించే తమ కీలక సైనిక కమాండ్ పేరు నుంచి 'ఇండో' అనే పదాన్ని తొలగించడం, అదే సమయంలో భారత్‌కు సంబంధించిన మ్యాప్‌లో పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను పాకిస్థాన్ భూభాగంగా చూపించడం వివాదానికి దారితీసింది. ముఖ్యంగా జీ-7 సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ద్వైపాక్షిక భేటీ జరగనున్న వేళ ఈ పరిణామాలు చోటుచేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

వివరాలు 

పాత పేరుకే అమెరికా మొగ్గు

అమెరికా రక్షణశాఖ తమ చారిత్రక 'యూఎస్ ఇండో-పసిఫిక్ కమాండ్' పేరును తిరిగి 'యూఎస్ పసిఫిక్ కమాండ్'గా మార్చినట్లు ప్రకటించింది. ఈ నిర్ణయానికి గల కారణాలను వివరిస్తూ.. చారిత్రక వారసత్వాన్ని కాపాడటం, పసిఫిక్ ప్రాంతంలో సేవలందించే సైనికుల్లో స్ఫూర్తిని పెంపొందించడం కోసం పాత పేరునే పునరుద్ధరించినట్లు వెల్లడించింది. అయితే, 'ఇండో' అనే పదాన్ని తొలగించడం వెనుక వ్యూహాత్మక కారణాలున్నాయా? భారత్‌కు అమెరికా ఇస్తున్న ప్రాధాన్యతలో మార్పు వచ్చిందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

వివరాలు 

పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై మరో వివాదం

పేరు మార్పుతో పాటు అమెరికా వెబ్‌సైట్‌లో ప్రచురించిన ఓ మ్యాప్ కూడా వివాదానికి కేంద్రబిందువైంది. యూఎస్ పసిఫిక్ కమాండ్ పరిధిని చూపించే ఆ చిత్రంలో పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను పాకిస్థాన్ భూభాగంలో భాగంగా చూపించినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఈ అంశంపై భారత్‌లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఏడు దశాబ్దాల చరిత్ర యూఎస్ పసిఫిక్ కమాండ్‌ను 1947 జనవరి 1న అప్పటి అమెరికాఅధ్యక్షుడు హ్యారీ ఎస్ ట్రుమ్యాన్ ఏర్పాటు చేశారు. అమెరికా పశ్చిమ తీర ప్రాంతం నుంచి భారత పశ్చిమ తీర ప్రాంతం వరకు విస్తరించిన భౌగోళిక పరిధిలో ఈ కమాండ్ గత ఏడు దశాబ్దాలకు పైగా సేవలందిస్తోంది. రెండో ప్రపంచ యుద్ధం అనంతరం ప్రాంతీయ భద్రత,స్థిరత్వం కోసం ఈ కమాండ్ కీలక పాత్ర పోషించింది.

Advertisement

వివరాలు 

2018లో 'ఇండో' ఎందుకు చేర్చారు?

కొరియా, వియత్నాం యుద్ధాల్లో పాల్గొనడమే కాకుండా అనేక మానవతా సహాయక చర్యలను కూడా నిర్వహించింది. డొనాల్డ్ ట్రంప్ తొలి అధ్యక్ష పదవీకాలంలో 2018లో యూఎస్ పసిఫిక్ కమాండ్ పేరును 'యూఎస్ ఇండో-పసిఫిక్ కమాండ్'గా మార్చారు. హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రాల మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక, ఆర్థిక అనుసంధానాన్ని గుర్తించి ఈ మార్పు చేసినట్లు అప్పటి అమెరికా రక్షణ మంత్రి జేమ్స్ మ్యాటిస్ వెల్లడించారు. ఇండో-పసిఫిక్ వ్యూహంలో భారత్ కీలక భాగస్వామి అనే సంకేతాన్ని ప్రపంచానికి ఇవ్వడంలో ఈ నిర్ణయం అప్పట్లో కీలకంగా నిలిచింది.

Advertisement

వివరాలు 

అమెరికా యూటర్న్‌పై చర్చ

అయితే, ఎనిమిదేళ్ల తర్వాత అమెరికా తిరిగి పాత పేరుకు వెళ్లడం రాజకీయ, వ్యూహాత్మక వర్గాల్లో చర్చకు దారితీసింది. భారత్‌తో రక్షణ, భద్రతా రంగాల్లో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్న అమెరికా.. ఇప్పుడు తన వ్యూహంలో మార్పులు చేస్తోందా? లేక ఇది కేవలం చారిత్రక గుర్తింపును పునరుద్ధరించే చర్య మాత్రమేనా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. జీ-7 సమావేశాల వేళ ఈ పరిణామం చోటుచేసుకోవడంతో భారత్-అమెరికా వ్యూహాత్మక సంబంధాలపై కొత్త చర్చకు తెరలేచింది.

Advertisement