
India-USA:భారత్‌కు $1.17 బిలియన్ల హెలికాప్టర్ పరికరాలు ఆమోదించిన అమెరికా
ఈ వార్తాకథనం ఏంటి
భారత్-అమెరికా వ్యూహాత్మక బంధంలో మరో ముఖ్యమైన పరిణామం చోటుచేసుకుంది.
భారతదేశానికి భారీ స్థాయిలో హెలికాప్టర్ విడిభాగాల సరఫరాకు అమెరికా ఆమోదం తెలిపింది. పెంటగాన్ ఈ విషయంపై అధికారిక ప్రకటన విడుదల చేసింది.
భారతదేశానికి 1.17 బిలియన్ డాలర్లు (సుమారు రూ.9,900 కోట్లు) విలువైన హెలికాప్టర్ విడిభాగాల విక్రయానికి అమెరికా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
ఈ విడిభాగాలను ఎంహెచ్-60ఆర్ సీహాక్ (MH-60R Seahawk) హెలికాప్టర్‌ల సామర్థ్యాన్ని పెంచడానికి వినియోగించనున్నారు.
ఈ ఒప్పందంలో ప్రముఖ ఆయుధ తయారీ సంస్థ లాక్‌హీడ్ మార్టిన్ కీలక పాత్ర పోషించనుందని సమాచారం.
వివరాలు
ఎంహెచ్-60ఆర్ సీహాక్ హెలికాప్టర్ ప్రత్యేకతలు
ఎంహెచ్-60ఆర్ సీహాక్ హెలికాప్టర్లను సముద్రజలాల్లో దాగి ఉన్న శత్రు జలాంతర్గాములను గుర్తించి, నాశనం చేయడానికి ప్రత్యేకంగా రూపొందించారు.
ఇందులోని అధునాతన ఆయుధ వ్యవస్థలు శత్రువులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సహాయపడతాయి:
38 లేజర్-గైడెడ్ రాకెట్లతో పాటు నాలుగు ఎంకే54 టోర్పిడోలు
మెషీన్‌గన్‌లు
ఫార్వర్డ్-లుకింగ్ ఇన్‌ఫ్రారెడ్ సెన్సర్లు: ఇవి రాడార్లకు, జలాంతర్గాములకు సంబంధించిన ఖచ్చితమైన డేటాను అందిస్తాయి. ఈ హెలికాప్టర్ ఒక ప్రాంతాన్ని స్కాన్ చేసి క్షిపణి దాడుల హెచ్చరికలను జారీ చేయగలదు.
సముద్రతీర రక్షణలో అత్యంత కీలకమైన ఆయుధంగా ఇది గుర్తింపు పొందింది.
ఈ ఒప్పందంతో భారత్-అమెరికా సంబంధాలు మరింత బలపడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.