Iran war: హర్మూజ్ గుండా చమురు రవాణా నిలిపేస్తాం.. అమెరికాకు ఇరాన్ హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకూ మరింత పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న రెండు నౌకలను ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) లక్ష్యంగా చేసుకున్నట్లు ప్రకటించింది. తమ హెచ్చరికలను పట్టించుకోకుండా ప్రయాణం కొనసాగించడంతో ఈ చర్య చేపట్టినట్లు తెలిపింది. దాడుల అనంతరం ఆ నౌకల్లో పేలుళ్లు సంభవించాయని, ప్రస్తుతం అవి కదల్లేని స్థితిలో ఉన్నట్లు వెల్లడించింది. అమెరికా దాడులు కొనసాగినంతకాలం హర్మూజ్ జలసంధి గుండా ఒక్క చుక్క చమురు కూడా సురక్షితంగా వెళ్లదని ఐఆర్‌జీసీ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. తమ ప్రతీకార చర్యలకు అమెరికా సిద్ధంగా ఉండాలని స్పష్టం చేసింది.
వివరాలు
బ్యారెల్‌కు 90 డాలర్లు పెరిగిన బ్రెంట్ క్రూడ్ ధర
మరోవైపు సోమవారం తెల్లవారుజామున అమెరికా మరోసారి ఇరాన్‌పై వైమానిక దాడులు చేపట్టింది.
తమ సైనికుల మరణాలకు ప్రతీకారంగానే ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.
శక్తివంతమైన దాడులు నిర్వహించామని ఆయన పేర్కొన్నారు. ఇటీవల ప్రారంభమైన ఈ ఘర్షణల్లో ఇప్పటివరకు అమెరికా వైపు మరణాల సంఖ్య 17కు చేరినట్లు సమాచారం.
పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల ప్రభావం అంతర్జాతీయ చమురు మార్కెట్‌పై కూడా స్పష్టంగా కనిపిస్తోంది.
సరఫరాపై ఆందోళనలు పెరగడంతో సోమవారం బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 90 డాలర్లకు చేరింది.
వివరాలు
కువైట్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం
అమెరికా-ఇరాన్ ఘర్షణల ప్రభావం గల్ఫ్ దేశాలపై కూడా పడుతోంది. కువైట్‌లోని అల్ సుబియా పవర్ జనరేషన్, వాటర్ డీసాలినేషన్ ప్లాంట్‌పై టెహ్రాన్ దాడులు జరిపినట్లు సమాచారం.
దీంతో అక్కడ భారీ మంటలు చెలరేగాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.