Page Loader
USA: యెమెన్‌ రాజధాని హూతీల స్థావరాలపై అమెరికా దాడులు
యెమెన్‌ రాజధాని హూతీల స్థావరాలపై అమెరికా దాడులు

USA: యెమెన్‌ రాజధాని హూతీల స్థావరాలపై అమెరికా దాడులు

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 22, 2024
08:57 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య కొనసాగుతున్న పోరు పశ్చిమాసియాలో పరిస్థితులను మరింత ఉద్రిక్తతంగా మార్చాయి. రోజువారీ దాడులు, ప్రతిదాడులతో ఈ ప్రాంతం అట్టుడుకుతోంది. శనివారం హూతీ తిరుగుబాటుదారులు ఇజ్రాయెల్‌ రాజధాని టెల్‌అవీవ్‌పై క్షిపణి దాడులు నిర్వహించడం, ఆపై అమెరికా ప్రతీకార చర్యలకు దిగడం ఈ ఉద్రిక్తతలను మరింత పెంచింది. హూతీ తిరుగుబాటుదారులు టెల్‌అవీవ్‌పై ప్రొజక్టైల్‌ క్షిపణులను ప్రయోగించగా, ఇజ్రాయెల్‌ రక్షణ వ్యవస్థ వీటిని అడ్డుకోవడంలో విఫలమైంది. ఈ దాడుల్లో 16 మంది గాయపడినట్లు సమాచారం. వెంటనే టెల్‌అవీవ్‌ అధికారులు విచారణకు ఆదేశించారు. ఈ దాడికి ప్రతిస్పందనగా అమెరికా యెమెన్‌ రాజధానిలోని హూతీల స్థావరాలపై వైమానిక దాడులు చేసింది.

Details

ఇజ్రాయెల్ పై దాడులు కొనసాగిస్తామని హుతీల ప్రకటన

ఎర్ర సముద్రం, బాబ్‌ అల్‌ మాండెబ్‌, ఏడెన్ గల్ఫ్‌ ప్రాంతాల్లో వ్యాపార నౌకలపై హూతీల దాడులను అడ్డుకునేందుకు, వారి కార్యకలాపాలకు అంతరాయం కలిగించడమే ఈ దాడుల లక్ష్యమని అమెరికా మిలిటరీ పేర్కొంది. గత గురువారం ఇజ్రాయెల్‌ దళాలు యెమెన్‌లో హూతీ తిరుగుబాటుదారుల సైనిక స్థావరాలపై వైమానిక దాడులు జరిపాయి. దీనికి ప్రతీకారంగా శనివారం టెల్‌అవీవ్‌పై హూతీలు క్షిపణి దాడులకు పాల్పడ్డారు. గాజాపై యుద్ధం ఆగే వరకు ఇజ్రాయెల్‌పై తమ దాడులు కొనసాగుతాయని హూతీలు ప్రకటించారు. ఇజ్రాయెల్‌-హమాస్‌ పోరు గాజా సరిహద్దులను దాటుతూ, యెమెన్‌, ఇరాన్‌ వంటి దేశాలకు చేరడంతో పశ్చిమాసియా స్థిరత్వం ముదిరిపోతోంది. ఈ ఉద్రిక్తతలు ఎలా ముగుస్తాయనే ప్రశ్నకు సమాధానం దొరకటం కష్టతరంగా మారింది.