Loading...
US student visa rule: అమెరికాలో భారత విద్యార్థులకు భారీ ఊరట.. నాలుగేళ్ల నిబంధన రద్దు
అమెరికాలో భారత విద్యార్థులకు భారీ ఊరట.. నాలుగేళ్ల నిబంధన రద్దు

US student visa rule: అమెరికాలో భారత విద్యార్థులకు భారీ ఊరట.. నాలుగేళ్ల నిబంధన రద్దు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 26, 2026
11:12 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న లక్షలాది మంది అంతర్జాతీయ విద్యార్థులకు,ముఖ్యంగా భారతీయ విద్యార్థులకు భారీ ఊరట లభించింది. విద్యార్థుల అడ్మిషన్ కాలాన్ని గరిష్ఠంగా నాలుగేళ్లకే పరిమితం చేయాలని ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించిన నిబంధనను అమెరికా ఫెడరల్ కోర్టు రద్దు చేసింది. దీంతో విద్యార్థులు తమ విద్యా కార్యక్రమం పూర్తయ్యే వరకు అమెరికాలో ఉండేందుకు మార్గం సుగమమైంది. కేవలం కోర్సు నాలుగేళ్లు దాటిందనే కారణంతో వీసా పొడిగింపు కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. నవంబర్ 16న యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి ఎఫ్. డెన్నిస్ సేలర్ IV ఈ మేరకు కీలక తీర్పు వెలువరించారు.

వివరాలు 

విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చనున్న తీర్పు

అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (DHS) ప్రతిపాదించిన 'డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్' (D/S) నిబంధనను ఆయన కొట్టివేశారు.

దీంతో దేశవ్యాప్తంగా గతంలో అమల్లో ఉన్న విధానమే కొనసాగనుంది. ముఖ్యంగా పీహెచ్‌డీ, దీర్ఘకాలిక పరిశోధన కోర్సులు వంటి నాలుగేళ్లకు మించి సమయం పట్టే విద్యా కార్యక్రమాల్లో ఉన్న విద్యార్థులకు ఈ తీర్పు ప్రయోజనం చేకూర్చనుంది.

వారు తమ ఎఫ్‌-1 ఇమ్మిగ్రేషన్ స్టేటస్‌ను కొనసాగిస్తూ ఎలాంటి అదనపు ఇబ్బందులు లేకుండా చదువు పూర్తి చేసుకోవచ్చు.

వివరాలు 

అసలు నాలుగేళ్ల నిబంధన ఏమిటి?

ప్రస్తుతం అమల్లో ఉన్న 'డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్' విధానం ప్రకారం ఎఫ్‌-1 విద్యార్థులు తమ కోర్సు పూర్తయ్యే వరకు అమెరికాలో ఉండేందుకు అనుమతి ఉంటుంది.

అయితే, 2026 జులై 17న డీహెచ్ఎస్ ఈ విధానంలో మార్పులు ప్రతిపాదించింది.

కొత్త నిబంధన ప్రకారం అంతర్జాతీయ విద్యార్థుల అడ్మిషన్ కాలాన్ని గరిష్ఠంగా నాలుగేళ్లకు పరిమితం చేయాలని నిర్ణయించింది.

అంతకంటే ఎక్కువ సమయం చదువుకు అవసరమైతే యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS)కు దరఖాస్తు చేసుకుని అనుమతి పొందాల్సి ఉంటుంది.

అంతేకాకుండా, కోర్సు పూర్తయిన తర్వాత విద్యార్థులు అమెరికాను విడిచి వెళ్లేందుకు ప్రస్తుతం ఇస్తున్న 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను 30 రోజులకు తగ్గించాలని కూడా ప్రతిపాదించింది.

ADVERTISEMENT

వివరాలు 

అసలు నాలుగేళ్ల నిబంధన ఏమిటి?

ఈ మార్పులు అమల్లోకి వస్తే దీర్ఘకాలిక కోర్సులు చదివే విద్యార్థులపై అదనపు భారం పడే అవకాశం ఉండేది.

అయితే, ఈ ప్రతిపాదనల వల్ల కలిగే ప్రయోజనాలు, నష్టాలను డీహెచ్ఎస్ సమగ్రంగా పరిశీలించలేదని జడ్జి సేలర్ తన తీర్పులో పేర్కొన్నారు.

అంతర్జాతీయ విద్యార్థుల వివరాలను పర్యవేక్షించేందుకు ఇప్పటికే అందుబాటులో ఉన్న స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (SEVIS)ను మరింత మెరుగుపరిచే అవకాశాన్ని ఎందుకు పరిశీలించలేదని ప్రశ్నించారు.

కొత్త నిబంధనలు విద్యార్థుల అకడమిక్ స్వేచ్ఛను దెబ్బతీసేలా ఉన్నాయని, వాటిని తీసుకొచ్చే అధికారం డీహెచ్ఎస్ పరిధిని మించిపోయిందని కోర్టు అభిప్రాయపడింది.

ఎఫ్‌-1 వీసా కార్యక్రమాన్ని బలహీనపరిచే స్థాయిలో విస్తృత అధికారాలను డీహెచ్ఎస్‌కు చట్టం కల్పించలేదని న్యాయమూర్తి స్పష్టం చేశారు.

ADVERTISEMENT

వివరాలు 

భారత విద్యార్థులకు కలిగే ప్రయోజనాలివే..

ఈ తీర్పుతో అమెరికాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులకు పలు ప్రయోజనాలు కలగనున్నాయి.

నాలుగేళ్ల పరిమితి తొలగింపు: పీహెచ్‌డీ, ఇతర దీర్ఘకాలిక కోర్సులు అభ్యసించే విద్యార్థులు నాలుగేళ్లు దాటిన తర్వాత వీసా పొడిగింపు కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. పాత విధానం ప్రకారం కోర్సు పూర్తయ్యే వరకు అమెరికాలో ఉండవచ్చు.

60 రోజుల గ్రేస్ పీరియడ్ కొనసాగింపు: కోర్సు లేదా ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT) పూర్తయిన తర్వాత అమెరికా విడిచి వెళ్లేందుకు ప్రస్తుతం ఉన్న 60 రోజుల గడువు యథాతథంగా కొనసాగుతుంది. దీనిని 30 రోజులకు తగ్గించాలన్న ప్రతిపాదన అమల్లోకి రాదు.

వివరాలు 

భారత విద్యార్థులకు కలిగే ప్రయోజనాలివే..

యూనివర్సిటీ మార్పులపై ఆంక్షలు ఉండవు: ఒక విశ్వవిద్యాలయం నుంచి మరో విశ్వవిద్యాలయానికి మారడం లేదా కోర్సు మార్చుకోవడంపై ప్రతిపాదించిన అదనపు ఆంక్షలు అమలు కావు.

OPT, STEM OPT ప్రయోజనాలు: ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT), 24 నెలల STEM OPT పొడిగింపునకు గతంలో ఉన్న నిబంధనలే వర్తిస్తాయి.

వివరాలు 

సీపీటీపై ఆంక్షలకు మరో కోర్టు బ్రేక్

అంతర్జాతీయ విద్యార్థులకు మరో విషయంలోనూ ఊరట లభించింది. 'కరిక్యులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్' (CPT)పై స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ (SEVP) విధించిన ఆంక్షలను మరో అమెరికా ఫెడరల్ కోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది.

డిగ్రీ పూర్తి చేయడానికి తప్పనిసరిగా అవసరమైన ఇంటర్న్‌షిప్‌లకు మాత్రమే సీపీటీ వర్తిస్తుందని, ఐచ్ఛిక ఇంటర్న్‌షిప్‌లకు ఈ సదుపాయం వర్తించదని ఎస్ఈవీపీ ఆగస్టులో కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.

ఈ మార్పు ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయమని పేర్కొంటూ నవంబర్ 17న జడ్జి జూలియా కోబిక్ ఆ మార్గదర్శకాలపై తాత్కాలిక స్టే విధించారు.

వివరాలు 

సీపీటీపై ఆంక్షలకు మరో కోర్టు బ్రేక్

మొత్తంగా ఈ రెండు కోర్టు తీర్పులు అమెరికాలో ప్రస్తుతం చదువుకుంటున్న విద్యార్థులతో పాటు ఉన్నత విద్య కోసం అక్కడికి వెళ్లాలని భావిస్తున్న అంతర్జాతీయ విద్యార్థులకు ఊరటనిచ్చాయి.

అయితే, ఈ తీర్పులను సవాలు చేస్తూ ట్రంప్ ప్రభుత్వం పైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని న్యాయనిపుణులు చెబుతున్నారు.

అందువల్ల విద్యార్థులు తమ విశ్వవిద్యాలయాల ఇమ్మిగ్రేషన్ సలహాదారుల సూచనలు పాటించాలని, వీసా నిబంధనలకు సంబంధించి వచ్చే తాజా పరిణామాలను ఎప్పటికప్పుడు గమనించాలని సూచిస్తున్నారు.

ADVERTISEMENT