LOADING...
Deportation: గ్రీన్‌కార్డ్ హోల్డర్లకు షాక్‌.. నేరాలకు పాల్పడితే దేశ బహిష్కరణకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్
గ్రీన్‌కార్డ్ హోల్డర్లకు షాక్‌..నేరాలు చేస్తే దేశ బహిష్కరణకు గ్రీన్‌సిగ్నల్

Deportation: గ్రీన్‌కార్డ్ హోల్డర్లకు షాక్‌.. నేరాలకు పాల్పడితే దేశ బహిష్కరణకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 24, 2026
08:16 am

ఈ వార్తాకథనం ఏంటి

డిపోర్టేషన్‌ (దేశ బహిష్కరణ) అంశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి అనుకూలంగా అమెరికా సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. నైతిక దుష్ప్రవర్తనకు సంబంధించిన నేరాల్లో పాల్గొన్నట్లు నిర్ధారణ అయితే, వారు శాశ్వత నివాసితులు లేదా గ్రీన్‌కార్డ్ హోల్డర్లు అయినప్పటికీ దేశం నుంచి బహిష్కరించే అధికారాలు ప్రభుత్వానికి ఉన్నాయని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే కేవలం అనుమానాల ఆధారంగా కాకుండా,సంబంధిత వ్యక్తి నేరానికి పాల్పడి ఉండొచ్చని నమ్మడానికి తగిన బలమైన కారణాలు ఉన్నాయని అధికారులు నిర్ధారించాల్సి ఉంటుందని కోర్టు పేర్కొంది. ఈ తీర్పు ప్రకారం నేరారోపణలు ఎదుర్కొంటున్న శాశ్వత నివాసితులు, గ్రీన్‌కార్డ్ హోల్డర్లకు అమెరికా ప్రవేశ ద్వారాల వద్దే ప్రవేశాన్ని నిరాకరించే అవకాశం అధికారులకు లభించనుంది.

వివరాలు 

నకిలీ ట్రేడ్‌మార్క్‌కు సంబంధించిన అభియోగాలు

అలాగే దేశ బహిష్కరణ చర్యల్లో సరిహద్దు భద్రతా సిబ్బందికి మరింత అధికార బలం చేకూరనుంది. ఈ కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే..గ్రీన్‌కార్డ్ హోల్డర్ అయిన చైనా పౌరుడు మక్ చోయ్‌పై నకిలీ ట్రేడ్‌మార్క్‌కు సంబంధించిన అభియోగాలు నమోదయ్యాయి. 2012లో చైనా నుంచి అమెరికాకు తిరిగి వచ్చిన సమయంలో అతడిని దేశంలోకి అనుమతించేందుకు అధికారులు నిరాకరించారు. అనంతరం కొన్ని కఠిన నిబంధనలతో ప్రవేశానికి అనుమతి ఇచ్చారు.తర్వాత తన తప్పును మక్ చోయ్ అంగీకరించడంతో అతడిని దేశం నుంచి బహిష్కరించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే తాను చేసిన నేరం నైతిక దుష్ప్రవర్తన కిందికి రాదని వాదిస్తూ అతడు న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు.

వివరాలు 

ఇరాన్ యుద్ధంపై ట్రంప్‌కు ఎదురుదెబ్బ

చివరకు ఈ కేసులో అమెరికా సుప్రీంకోర్టు అతడి వాదనలను తిరస్కరించి ప్రభుత్వ నిర్ణయానికే మద్దతు తెలిపింది. ఇక ఇరాన్ యుద్ధం అంశంలో ట్రంప్ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. పశ్చిమాసియాలో మోహరించిన అమెరికా బలగాలను వెనక్కి రప్పించడంతో పాటు అక్కడ కొనసాగుతున్న సైనిక చర్యలను నిలిపివేయాలని కోరుతూ తీసుకొచ్చిన తీర్మానానికి అమెరికా సెనెట్ ఆమోదం తెలిపింది. ఈ తీర్మానానికి అనుకూలంగా 50 మంది సెనేటర్లు ఓటు వేయగా, వ్యతిరేకంగా 48 మంది ఓటు వేశారు. దీంతో రెండు ఓట్ల స్వల్ప తేడాతో తీర్మానం ఆమోదం పొందింది.

Advertisement